కొత్త సంవత్సరంలో ఇలాటి టపాతో ముందుకొస్తాననుకోలేదు. అయితే, జీవితానికి మన అనుకోవడాల్తో ఎలాటి ప్రమేయమూ లేదన్న విషయం ఈ మధ్యనే తెలుసుకున్నాను.
సరిగ్గా మూడు వారాల క్రితం, జనవరి15 వ తేదీన మాఅమ్మగారు, శ్రీమతి విజయలక్ష్మిగారు పరమపదించారు. ఆవిడ వయసు అరవై మూడేళ్ళు. గత ఎనిమిదినెలలుగా అస్వస్థులైవున్నా, కోలుకుంటున్న సూచనలు బలంగా వుండడంతో మేమంతా ఆశలు పెంచుకున్నాం.
వృధ్ధాప్యంలో సాధారణంగా వచ్చే డయాబిటీసు, కొలెస్ట్రాల్, అధిక రక్తపు పోటు వగైరా సమస్యలు ఆవిడకి లేవని మేము మురిసినంత సేపు పట్టలేదు, ఆవిడ మమ్మల్నొదిలి వెళ్ళిపోవడానికి.
“చిన్న ఎండోస్కోపిక్ ప్రొసీజరు. గంటసేపే. ఎంత, రాత్రికల్లాతిరిగొచ్చేస్తాను,” అని అమాయకంగా ఎప్రిల్ ఇరవైన ఆస్పత్రికెళ్ళిన మనిషి అమాంతంగా మృత్యువు కోరల్లో చిక్కుకు పోయారు. ఎనిమిది నెలలు ఆవిడా, ఆవిడ బాధ చూడ లేక మేమూ విలవిలలాడాము. డాక్టర్ల అవిశ్రాంత పోరాటమూ, కుటుంబ సభ్యుల కన్నీళ్ళూ, తోబుట్టువుల ప్రార్థనలూ, అన్నదానాలూ, ఏవీ ఆవిడని ఆ కోరల నించి రక్షించ లేక పోయాయి.
ఎదురుగా మోహరించి వున్న సైన్యంతో పోరాడుతున్న సైనికుణ్ణి వెనక నించి పొడిచిన వెన్నుపోటు కూల్చిన చందాన–
తనకి జరిగిన అనేకానేక సర్జరీలు, లెక్కలేనన్ని సమస్యలతో పోరాడుతూ వున్నఆవిడని అనుకోని గుండె పోటు కబళించింది.
అమ్మ గురించి చెప్పమంటే ఏం చెప్తాం? ఆమెని మొదటి సారి చూసిందెప్పుడో కూడా తెలియదుమనకి. బహుశా మనని మనం గుర్తు పట్టే కంటే ముందే ఆమెని గుర్తుపడతామేమో.
ఇప్పటికీ, మా నలుగురికీ కలిపి రాసే వుత్తరాల్లో అయితే “నాన్నలూ” అంటూ, నాకొక్కదానికైతే, “చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి శారదకి ఆశీర్వచనములతో,” అంటూ ప్రారంభించి,
ఆమెకి వేరే పేరు లేనట్టు, “ప్రేమతో, అమ్మ” అని ముగించే అమ్మ–
వేల మైళ్ళ అవతల నుండి టెలిఫోనులో చిన్న అబధ్ధమాడినా, “దొంగా! అబధ్ధం చెప్తున్నావా?” అంటూ పట్టేసుకునే అమ్మ–
ఫేస్ బుక్కులో నన్నుపబ్లిగ్గా ప్రేమగా, “బడ్డూ!” అని తిట్టే అమ్మ–
మా చిన్న చిన్న విజయాలకి పొంగి పోతూ, ప్రోత్సహిస్తూ, పెద్ద పెద్ద సమస్యలని కూడా ధైర్యంగా ఎదుర్కోవడం నేర్పిన అమ్మ–
ఆడైనా మగైనా, ఆత్మ విశ్వాసమూ, కష్టపడే మనస్తత్వమూ, తన కాళ్ళ మీద తను నిలబడం చాలా ముఖ్యమని నేర్పిన అమ్మ–
మా పిల్లలిద్దరికీ “మా అమ్మ లాటి అమ్మా– నీకుందా బ్రహ్మా“ అనే పాట నేర్పి వాళ్ళిద్దరూ పాడుతూంటే నానా కళ్ళల్లో నీళ్ళు చూసి నవ్విన అమ్మ–
అంతలోనే అమాయకురాలిలా, అంత లోనే అఖండ మేధావిలా అనిపించే అమ్మ–
ఎదురైన ప్రతీ మనిషినీ, చిన్నా పెద్దా, స్థాయీ భేదాలు లేకుండా గౌరవించి, ప్రేమించడం నేర్పిన అమ్మ–
మంచం మీద వుండి కూడా, “అలమారలో చీరలన్నీ ఇస్త్రీ చేసి వున్నాయి. నీకు నచ్చిన చీరలన్నీ కట్టుకో” అని నా గురించే ఆలోచించ గలిగే అమ్మ–
“వదినా, నువ్వు పోతే మాకు మా కన్న తల్లే పోయినట్టుంది” అని పసిపిల్లల్లా బావురు మనే మరదుల్ని, ఆడపడుచుల్నీ కేవలం తన మంచితనంతోనే సంపాదించుకున్న అమ్మ–
ఆమె గురించి నా భావాలని చెప్పటానికి కానీ, ఆమె నిష్క్రమణ నాకు కలిగిస్తున్న నొప్పిని వివరించటానికి కానీ, సరిపడేంత భాష నాకు రాదు. నా కొచ్చిన మాటలు చాలవు.
శారద గారూ..
.. I think can feel your pain.. మీ ఆఖరి వాక్యం నన్ను బాగా కదిలించి వేసింది..
శారద గారు.. అమ్మ కన్నా మిన్న ఎవరు కాగలరు? అమ్మ గురించి చెప్పడానికి ఎవరికైనా మాటలు చాలవు,వ్రాతలు చాలవు. ప్రేమ భాష ఒక్కటే అమ్మని వర్ణించగలదు .
అమ్మని దూరం చేసిన మరణం మీకు అమ్మ ప్రేమని దూరం చేయలేదు.మీతోనే ఆమె ప్రేమ జ్ఞాపకాల రూపంలో మీ వెంటే ఉంటుంది.
“అమ్మ” గారి ఆత్మకి శాంతి కలగాలని ప్రార్దిస్తూ..
మీ మనసుకి స్వాంతన చేకూరడానికి మీకిష్టమైన సంగీతం చెంత ఎక్కువ గడపండి
బాధను వ్యక్తపరచగలిగే కొన్ని భావాలు బాషకు అందవండి..!
మీకు కలిగిన లోటు పూడ్చలేనిదే అయినా.. మనిషి వెళ్ళిపోయాకా ముఖ్యంగా మిగలవలసిన అప్యాయానురాగాలను ఆవిడ మీ అందరి వద్దా పొందుతున్నారు అన్న సంతృప్తితో మీరు త్వరగా ఈ బాధలోంచి బయటకు రావాలని కోరుకుంటున్నాను..
శారద గారు
మాటాడటానికి మనసు మూగపోయింది, కన్నీటిపొర కళ్ళను అడ్డింది, స్వాంతన ఎలా చెప్పాలో..మాటలు చాలటంలేదు.
అసతోమా సద్గమయ
తమసోమా జ్యోతిర్గమయ
మృత్యోర్మా అమృతం గమయ.
ఓం శాంతి శాంతి శాంతిః
Amma para brahma swaroopam. Meekaina naakaina.
Condolences on your sudden and irreparable loss.
chaalaa baadhaga vundi anadam chaalaa chinna maata ee sandarbamlo. No one can replace “amma’s” position in anybody’s life. Ee “abstract” feeling of sorrowness nunchi meeru kolukovaalani aasistunnamu.