అరవ సినిమా అందాలు

మన పక్కింటివాళ్ళ పిల్లలు గోల్డు మెడళ్ళూ అవార్డులూ కొట్టేస్తూ చదువులో మెట్లెక్కుతున్నారనుకోండి, సంతోషిస్తాం, అభినందిస్తాం. మన పిల్లలు అంత కాకపోయినా, ఏదో కొంచెం పర్వాలేదన్నట్టు చదువుతుంటే, మనసు కొంచెం మూల్గినా, పోనీలే, ఎవరి ప్రతిభ వారిదే అని సరి పెట్టుకుంటాం. కానీ, మన పిల్లలు ఒక్కొక్క పరీక్షా అయిదేసి సార్లు రాస్తూ, పదో తరగతి గట్టెక్కడానికి తంటాలు పడుతూంటే? ఏడుపొస్తుంది, కదూ? మన పిల్లల చదువు గురించి ఒక బాధైతే, పక్క వాళ్ళ పిల్లలని చూసి ఏడుపు రెండోది. కాదని అనగలరా?

సరిగ్గా అలాటి ఏడుపే నాకు తమిళ సినిమాలు చూసినప్పుడల్లా అనిపిస్తుంది. గత యేడాదిలో నేను ఏకంగా నాలుగైదు మంచి తమిళ సినిమాలు చూసాను. మంచి అంటే, ముందుగా నా ఉద్దేశ్యమేంటో చెప్తాను.

– మామూలు గా అనిపించే మనుషులు. అంటే మనలాగే చామన చాయలో వుంటూ (ఆడవాళ్ళైతే బట్టలు కూడా వేసుకుంటూ) మామూలు సమస్యలతో పోరాడేవాళ్ళు. మాఫియాలను మట్టి కరిపించే వీరులూ, దేవతా వస్త్రాలు ధరించి, సున్నం పూసినట్టున్న రంగులో వుండే స్త్రీలూ, పదిహేడేళ్ళు రాగానే బూతు మాటలు అలవాటైపోయిన కాలేజీ పిల్లలూ కాదన్నమాట.

– కొంచెం వైవిధ్యమైన కథనం

– మూసలో కాకుండ ఆకట్టుకునే కథ.

నిజం చెప్పాలంటే పాత్రలు నేలమీద నడిస్తే, కథలూ నేలమీదే నడుస్తాయి. దురదృష్టవశాత్తూ, చాలావరకు తెలుగు సినిమాల్లో పాత్రలు కాకుండా హీరోలూ, హీరోయిన్లూ వుంటారు. అందుకే అవంత ఆసక్తికరంగా అనిపించవేమో.

మనం ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా, అభిరుచి లోనూ, కథల్లో వైవిధ్యం లోనూ, కథనం లో కొత్తదనం లో నూ తెలుగు కంటే తమిళ సినిమా కొన్ని మైళ్ళు ముందున్న మాట మాత్రం నిజం. ఒకప్పుడు అరవ సినిమా అంటే, ఓవర్ ఆక్షనూ, భారీ డైలాగులూ, విచిత్రమైన మేకప్పులూ, వెకిలి హాస్యమూ వుండేవి. ఇప్పుడు అరవ సినిమా అవన్నీ వొదిలించుకొని గొప్ప సినిమాలందిస్తోంది. It is high time for the Telugu cinema to pick up the clues and change its tracks.

ఎనీవే, నేను చూసిన మంచి సిన్మాలు-“ పిజ్జా, పసంగ, కుంకి, వళక్కు ఎన్ 19/29, ముప్పొళుదుం వున్ కర్పనైగళ్, ఎంగేయుం ఎప్పోదుం (తెలుగులో జర్నీ)”.  ఇందులోంచి మూడు కొత్త సినిమాలని పరిచయం చేస్తాను.

——————————————

1) వళక్కు ఎన్ 19/29 (కేస్ నంబర్ 19/29)- (మే 2012)

ఈ సినిమా నేను ప్రాజెక్టు లెవెల్లో ఇక్కడ వుండే స్నేహితులందరికీ చూపించాను! తెలుగులో “ప్రేమలో పడితే” అని డబ్ చేసారు. హిట్టయిందో లేదో తెలియదు. నాకీసినిమా ప్రస్తుత వ్యవస్థ పైన అద్భుతమైన వ్యాఖ్య అనిపించింది. కథా, నటీ నటులూ, కథనమూ అన్నీ చాలా బాగనిపించాయి.

వేలు (శ్రీ) రోడ్డు పక్కనుండే టీ కొట్టులో పని చేస్తూంటాడు. ఆ పక్కనే వుండే అపార్ట్మెంట్లలో పని చేస్తూండే జ్యోతి అంటే అతనికదోరకమైన ఆకర్షణ. దురదృష్టవశాత్తూ, ఎప్పుడు అతన్ని జ్యోతి (ఉర్మిళా మహంతా) చూసినా, అతను ఒక రకమైన ఇబ్బందికర పరిస్థితిలో వుంటాడు. అందుకే జ్యోతికి అతనంటే చిరాకు. జ్యోతి పని చేసే అపార్ట్మెంట్లో వుంటుంది హైస్కూలు విద్యార్థిని ఆరతి (మనీషా యాదవ్). అదే బిల్డింగులో వుండే టీనేజరు దినేష్ డబ్బున్నవారి బిడ్డ. ఆరతిని ఆకర్షించడానికి ప్రయత్నిస్తూ వుంటాడు.

వున్నట్టుండి జ్యోతిని ఆస్పత్రిలో చేర్చాల్సి వస్తుంది. పోలీసులు రంగంలోకి దిగుతారు. రెండు కథలూ ఎలా అల్లుకుపోయాయి? జ్యోతికి జరిగిన ప్రమాదమేమిటి? వేలుని కనీసం చివరికైనా జ్యోతి అర్థం చేసుకుందా? న్యాయం,చట్టం అందరికీ ఒకే లాటి రక్షణ ఇస్తుందా? ఇన్ని ప్రశ్నలకీ సమాధానాలు దొరకొచ్చు కథలో. మనకా సమాధానాలు నచ్చుతాయని చెప్పలేం.

కథకేముంది, వికీపీడియాలోనో, ఇంకే సినిమా సైటులోనో చదివేసుకోవచ్చు.  కానీ, ఈ సినిమాలో నటీనటుల నటనా, రెండు పాయలుగా కథ నడిపించిన తీరూ నాకైతే చాలా గొప్పగా అనిపించింది. సినిమా కథలో లీనమైపోయిన నేను పాటలమీద పెద్దగా దృష్టి పెట్ట లేదు. చూడనివాళ్ళు వీలైతే సబ్-టైటిల్సు తో తమిళం లో చూసెయ్యడమే మంచిది.

 

2) పిజ్జా – (అక్టోబర్ 2012)

 

కథలు ఎవరిగురించైనా వుండొచ్చు- పిజ్జా డెలివరీ అబ్బాయిల గురించి కూడా. అలాగే హారర్ సినిమాలంటే, మానభంగానికి గురై, దయ్యమైపోయిన స్త్రీలగురించే అయుండక్కర్లేదు! ఈ రెండు పాయింట్లనీ కలుపుకున్న వైవిధ్యమైన కథే పిజ్జా.

మైకెల్ (విజయ్ సేతుపతి) తన ఫ్రెండు అనూ (రెమ్యా నంబీసన్) తో కలిసి సహజీవనం సాగిస్తూ వుంటాడు. అతను పిజ్జా కొట్లో డెలివరీ బాయ్ అయితే ఆమె వర్ధమాన రచయిత్రి. దయ్యాలూ, సస్పెన్సూ కలిపిన కథలు రాయడం ఆమె ప్రత్యెకత. ఎప్పటికైన ఒక గొప్ప హారర్ నవల రాసేసి డబ్బు సంపాదించాలని కలలు కనే యువతి. అనూ గర్బవతి అని తెలిసి ఇద్దరూ పెళ్ళాడతారు.  ఈ సంగతి మైకెల్ తన స్నేహితులిద్దరితోనూ చెప్తాడు.

ఒక రోజు మైకెల్ ఏదో పని మీద తన బాస్ ఇంటికి వెళ్తాడు. అక్కడ ఆ బాస్ కి ఒక పిచ్చి పట్టిన కూతురు వుంటుంది. ఆ అమ్మాయి మైకెల్ వంక కోపంగా  చూస్తూ “నేను నిత్యాని” అంటుంది. అక్కడె వున్న భూత వైద్యుడు, ఆ అమ్మాయిని “నిత్యా” అనే పేరున్న మనిషి దయ్యం పూనిందని నిర్ధారిస్తాడు.

ఆ తర్వాత ఒక రోజు మైకెల్ ఒక ఇంట్లో పిజ్జా ఇవ్వడానికి వెళ్ళి రక్తసిక్తమైన గాయాలతో తిరిగొస్తాడు. అడిగిన దానికి ఏదీ సరిగ్గా బదులివ్వడు. అనూ చచ్చిపోయింది అని చెప్పి ఏడుస్తాడు. అతని స్నేహితులూ, బాసూ అతని ఇంటికి వెళ్ళి చూస్తే అసలు అక్కడ అనూ అనే మనిషి ఆనవాలే వుండవు. పోలిసులు కూడా అనూ గురించి ఎటువంటి ఆచూకీ ఇవ్వలేకపోతారు. పిజ్జా తీసుకెళ్ళిన ఇల్లు ఒక దయ్యాల కొంప అనీ, అందులో నిత్యా అనే అమ్మాయి దయ్యం వుందనీ తెలుసుకుంటారు.

అసలింతకీ ఏమయింది? నిత్యా ఎవరు? అనూ అనే మనిషి వుందా లేక మైకెల్ కల్పనా? సివరాకరికి ఏమయింది? ఇవే ప్రశ్నలతో చివరి దాకా చూడాల్సిందే.

నటీ నటులూ, కథా, సంగీతమూ అంతా బాగున్న ఈ సినిమాలో ముందుభాగాల్లో కొంచెం నత్త నడక అనిపించింది. అక్కడ ఇంకొంచెం క్రిస్ప్ గా వుండి వుంటే మొత్తం సినిమా పకోడీలా కరకరలాడేది.

అన్నట్టు, ఈ సినిమాలో దయ్యాల కొంపలో భార్యా భర్తల ఫోన్ రింగ్ టోన్లు-  ప్రఖ్యాత ఫ్రెంచి గాయని ఈడిత్ పియాఫ్  non jen regrettien ని గుర్తు తెచ్చింది. ఆ పాట ఇన్సెప్షన్ సినిమాలో కూడా బాక్ గ్రవుండ్ లో వస్తూ వుంటుంది.

 

3) కుంకి – డిసెంబరు 2012

 

ప్రఖ్యాత తమిళ నటుడు శివాజీ గణేశన్ మనవడూ,  ప్రభూ కొడుకు అయిన విక్రం  ఈ చిత్రానికి నాయకుడు. మొహంలో తాత గారి పోలికలు కొట్టొచ్చినట్టు కనిపించినా, నటనలో ఆయన్నేమీ అనుకరించలేదు విక్రం. ఈ సినిమా తెలుగులో “గజరాజు” పెరుతో విడుదల అయిందిట.

మాణిక్కం అనే ఏనుగు మావటివాడు బొమ్మన్ (విక్రం). మేన మావ తో కలిసి తిరుగుతూ, ఏనుగుని గుళ్ళకీ, సినిమాలకీ అద్దెకిస్తూ కాలక్షేపం చేస్తుంటాడు. కొండల మధ్యా, అడవుల మధ్యా వుండే ఒక తెగలోని అమ్మాయి అల్లి (లక్ష్మీ మెనన్). చిట్టడివిలో వుండే ఆ వూరికి వున్న పెద్ద బెడద మదపుటేనుగు కొంబన్. ఆ ప్రదేశాల్లో ఇలాటి wild elephants ని ఎదుర్కోవటానికి ప్రత్యేక శిక్షణ పొందిన ఏనుగులుంటాయి. వీటిని “కుంకీ” ఏనుగులంటారు.

ఒక చిన్న కమ్యూనికేషన్ గాప్ వల్ల అటుగా వెళ్తున్న మాణిక్కం ని కుంకీ ఏనుగనుకుంటారు ఆ పల్లె ప్రజలు. బొమ్మన్ కీ అతని మావయ్యకీ రాచ మర్యాదలు చేస్తారు. మర్నాడు వాళ్ళు ఎదురుచూస్తున్న నిజం కుంకీ రాగానే తాము మెల్లగా తప్పుకుందామనుకుంటారు మామా అల్లుళ్ళూ. అనుకోకుండ అక్కడ అల్లిని చూసిన బొమ్మన్ మెడలోతు ప్రేమలో కూరుకు పోతాడు. అక్కణ్ణించి కదలడం ఇష్టం లేక రాబోతున్న కుంకీ ఏనుగుని వొద్దని ఆపేస్తాడు. తన మాణిక్కానికే శిక్షణ ఇవ్వడానికి ప్రయత్నిస్తాడు. ఇంతలో కొంబన్ రానే వస్తాడు. కొంబన్ నించి పల్లెని మాణిక్కం రక్షించగలిగాడా? చివరికి ఈ ప్రేమ కథ ఏమయిందన్నదే మిగతా సినిమా.

నిజానికి ఈ సినిమాలో సంగీతమూ, నటీనటుల నటనా మామూలుగానే వున్నాయి. అయితే ఫోటోగ్రఫీ మాత్రం గ్రేట్!

అన్నిటికంటే, ఎప్పుడూ అర్బన్ యూత్ ప్రేమ కథలు చూసి బోరు కొట్టి వుందేమో, ఈ అమాయకుల కథ భలే నచ్చింది నాకు.

———————————–

 

 

4 thoughts on “అరవ సినిమా అందాలు

  1. శారద గారు. నేను మొదటి రెండు సినిమాల గురించి విన్నాను. ముడో సినిమా కుంకీ ని తెలుగులో గజరాజు చూశాను. సినిమా మొత్తం గొప్పగా లేకున్నా చివర్లో ఏనుగు త్యాగం గొప్పగా అనిపించింది. మీరన్నట్లు కెమెరా వర్క్ అద్భుతంగా ఉంది.
    ఇలాగే మంచి తమిళ సినిమాలు పరిచయం చేయగలరు.

  2. cool. తమిళ సినిమా మైళ్ళ ముందున్న సత్యం రెండు మూడేళ్ళ కిందట కనిపెట్టాను. కానీ నాకిక్కడ డీసెంట్ క్వాలిటీ డిస్కులు దొరకవు. మీరు ఈ సినిమాల్ని ఎక్కడ, ఎలా చూశారు? పిజ్జా మొన్న ఏదీ టీవీఛానెల్లో వచ్చింది కానీ నేను వేరే పనిలో ఉండి చూళ్ళేదు.

Narayanaswamyకు స్పందించండి స్పందనను రద్దుచేయి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s