యుగళ గీతం

సాధారణంగా శాస్త్రీయ సంగీత కచ్చేరీల్లో ఒక ప్రధాన పాత్రధారి వుంటారు. (గాయకులే కావొచ్చు, వాయిద్య కారులే కావొచ్చు). వారికి పక్క వత్తాసుగా ఇంకా వేరే వాద్యకారులూ, మృదంగ విద్వాంసులూ వుండడం సాధారణం.

ఉత్తర భారతీయ సంప్రదాయమైన హిందుస్తానీ సంగీతంలో తబల వాయిద్యం, సుర్ బహార్ వాయిద్యం వుంటాయి. దక్షిణ భారతీయ సంప్రదాయమైన కర్ణాటక సంగీతంలో ముఖ్య విద్వాంసులకి తోడుగా, మృదంగ సహకారం, వయోలీన్ (కొన్నిసార్లు వేణువు) వాదనా వుంటాయి. కొన్నిసార్లు ఇద్దరు ముఖ్య కళాకారులతో కచేరీలు కూడా జరగొచ్చు.

అయితే ఇద్దరూ సమాన స్థాయి కళాకారులైతే? ఇద్దరూ కలిసి కచ్చేరీ చేస్తే? ఇద్దరూ వేర్వేరు సంప్రదాయాలైతే?దాన్నే సాధారణంగా “జుగల్బందీ” అని పిలుస్తారు.

హిందుస్తానీ-కర్ణాటక సంగీతాలు కలిపి చేసే జుగల్ బందీ లో విద్వాంసులు రెండు పధ్ధతుల్లోనూ సమాంతరంగా వుండే రాగాలని తీసుకొని పాడతారు. కర్ణాటక సంగీతంలో పాటకి మృదంగం తోడుగా వుంటే హిందుస్తానీ తబలాతో సాగుతుంది. రెండు పాటలూ ఒకే తాళంలో కూడా వుంటే మరీ మంచిది.

బాల మురళీ కృష్ణ గారు కిషోరీ అమోన్కర్ తో కలిసి పంతువరాళి/పూరియా ధనాశ్రీ జుగల్బందీ జగత్ప్రసిధ్ధమైనది. అమోన్కర్ గారు పాడిన ఖయాల్ “పాయలియా ఝంకార్” ని బాల మురళీ కృష్ణ గారు “మువ్వలు ఘల్లనగా” అని అనువాదం కూడా చేసి పాడారు.

అయిదారేళ్ళ క్రితం శశాంక్ వేణువూ- పుర్బాయన్ చటర్జీ సితార్ జుగల్బందీ జరిగింది అడిలైడ్ లో. అది బాగానే వున్నా, ఎందుకో శశాంక్ చాలా నిరాసక్తంగా వాయించినట్టనిపించింది  నాకు.

ఆరునెలలకింద వోమడిలైడ్-13 (WOMADELAIDE-2013) లో శ్రీమతి సుధా రఘునాథన్- శ్రీమతి మంజరి కేల్కర్ తో కలిసి జుగల్బందీ చేసారు. దీనికి నేను వెళ్ళలేకపోయినా, మురళీ మధూ వెళ్ళి వచ్చారు. అయితే మిట్ట మధ్యాహ్నం ఎర్రటి ఎండలో పంతువరాళి-పూరియా ధనాశ్రీ రాగాలు అంతగా రక్తి కట్టలేదన్నారు మురళి.

Image

A Sublime Journey

మొన్న ఆదివారం (15 సెప్టెంబరు) అడిలైడ్ లో కొంచెం విభిన్నమైన జుగల్ బందీ జరిగింది.

ఆ ఆదివారం సాయంత్రం శృతి-అడిలైడ్ అధ్వర్యం లో శ్రీమతి నిర్మలా రాజశేఖర్ గారు వీణ పైనా, శ్రీ గౌరవ్ మజుందార్ సితార్ పైనా జుగల్బందీ చేసారు. వీణ కి మృదంగ సహకారం శ్రీ తంజావూర్ మురుగభూపతి గారిస్తే, సితార్ కి తబలా సహకారం సిడ్నీ కి చెందిన శ్రీ కిషన్ గారిచ్చారు. దాదాపు మూడున్నర గంటల సేపు జరిగిన వాద్య కచేరీ భలే పసందుగా వుండింది.

మజుందార్ కీర్తి శేషులు పండిట్ రవి శంకర్ గారి ప్రియ శిష్యులు. ఆయన తయారు చేసిన “ఈస్ట్ మీట్స్ వెస్ట్” అనే ఆల్బం కి 2004 లో గ్రామీ నామినేషన్ దక్కింది. దేశ విదేశాల్లో ఆయన సంగీతం వ్యాపించి వుంది.

చెన్నై బెంగులూరు నగరాల్లో వీణ అభ్యాసం ప్రారంభించిన నిర్మలా రాజశేఖర్ గారు దేశ విదేశాల్లో అన్ని గొప్ప ఆడిటోరియంలలో కచ్చేరీలు చేసారంటే అతిశయోక్తి కాదు.

వీళ్ళిద్దరూ కలిసి ఆ రోజు పలికించిన రాగాలూ, తంత్రీ మూర్ఛనలూ నిలువునా తడిపేశాయి శ్రోతలను.

ఇంతకు ముందు చెప్పినట్టు జుగల్బందీల్లో సాధారణంగా ఎవరిది వాళ్ళే పాడుకుంటారు. ఇద్దరు విద్వాంసులూ “కలిసి” పాడడం చాలా అరుదు. అయితే ఈ వీణా-సితార్ జుగల్బందీ లో మాత్రం చాలా వరకు ఇద్దరూ కలిసే వాయించారు. అందుకే అది మిగతా జుగల్బందీ లకంటే కొంచెం విభిన్నంగా అనిపించింది.

ముందుగా ఇద్దరూ కలిసి “కళావతి”, “వసంత”, “శివరంజని “రాగల రాగమాలికలో వాళ్ళ సిగ్నేచర్ ట్యూను వాయించారు. చకచకా వున్న నడకతో ఆ పాట శ్రోతలని తల తిప్పుకోనివ్వలేదు.

ఆ తర్వాత ఇద్దరూ కలిసి “సిధ్ధి వినాయకం అనిషం” పాట షణ్ముఖ ప్రియ లో వాయించారు. ఇక్కడ హిందుస్తానీ రాగాల గురించి కొంచెం మాట్లాడుకోవాలి. నిజానికి, కర్ణాటక సంగీతం లో వుండే కొన్ని రాగాలు హిందుస్తానీ సంగీతం లో వుండవు. కానీ, హిందుస్తానీ విద్వాంసులు వాటిని కర్ణాటక సంగీతం నుంచి దత్తత తీసుకొని హిందుస్తానీ బాణీలో పాడతారు. ఉదాహరణకిచారుకేశి, కీరవాణి, సరస్వతి, సిమ్హేంద్ర మధ్యమం లాటివి. అందుకే నాకు షణ్ముఖ ప్రియ సితార్ మీద ఎలా వాయిస్తారబ్బా, అని అనుమానం వేసింది. కానీ పాట చాలా బాగా వచ్చింది. అయితే ఒక్క విషయం మాత్రం కొంచెం బాధించింది. పాట మధ్యలో నిర్మల గారు మైక్ దొరకబుచ్చుకొని అక్కడక్కడా గాత్రం పాడారు. మరి ఆవిడ గొంతే అంతనో లేకపోతే ఆ రోజేమైనా సమస్యో కానీ,ఆవిడ పాట అంతగా నచ్చలేదు.

ఆ తరవాత ఇద్దరూ మోహనం-భూపాలి వాయించారు. అందులో కలిసి వాయించలేదు కానీ ఒకరి తర్వాత ఒకళ్ళు అంది పుచ్చుకుంటూ అదొకరకమైన థ్రిల్ అందిచ్చారు.

ఇరవై నిముషాల విరామం అనంతరం అవాళ్టికి ముఖ్య రాగం కల్యాణి-యమన్ రాగాన్నెత్తుకున్నారు. ఇది కూడా కొంచెం ప్రయోగాత్మకంగానే అనిపించింది.

రాగం- తానం -పల్లవి / ఆలాప్ – జోడ్ఝాలా – గత్ లు అందంగా అల్లి నట్టనిపించింది. అంటే ఆవిడ రాగం, ఆయన ఆలాప్, ఆవిడ తానం- ఆయన జోడ్ఝాలా, ఆవిడ పల్లవి ఆయన గత్ అలా వాయించి ముక్తాయి స్వరాలు మాత్రం ఇద్దరూ కలిసి వాయించారన్నమాట. మధ్యలో మృదంగం, తబల తని-ఆవర్తనాలు చేసారు.

కాఫీ-పీలూ రాగలలో ఆవిడ “ఎన్న తవం శైదనై” వాయిస్తే ఆయన, రవి శంకర్ గారి ధున్ వాయించారు.

ఆఖర్న ఇద్దరూ “వైష్ణవ జనతో”పాటతో కచేరీ ముగించారు. మళ్ళీ అందులో కూడా నిర్మల గారు అక్కడక్కడా గాత్రం ఇచ్చారు. (అదికూడా నాకు అనవసరం అనిపించింది.)

అన్నట్టు, నిర్మలా రాజశేఖర్- గౌరవ్ మజుందార్ గార్లు తమ జుగల్బందీని “Sublime Journey” అని పిలుచుకుంటారు. నిజంగానే ఆ రాత్రి అందమైన ప్రయాణం లా జరిగింది.

 

————————————————

2 thoughts on “యుగళ గీతం

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s