పరోపకారార్థం…..

చాలా రోజులుగా నేను నా ఇల్లు, నా పిల్లలూ, నా సంసారం, నా సంగీతం, నా రాతలు అంటూ నాకు మాత్రమే చోటున్న సెల్ఫ్- సెంట్రిక్ ప్రపంచంలో కొట్టుకుపోతూన్న భావన కలుగుతూంది నాకు. బహుశా ఎదుగుతున్న వయసులో వున్న పిల్లలూ, మన ఆప్యాయతా, అటెన్షనూ ఆశించే పెద్దవాళ్ళూ వున్న ఈ ఫేజ్ లో అందరికీ అంతే కాబోలు.

 అయితే కొంచెం కళ్ళు తెరిచి నాకేమాత్రమూ సంబంధం లేని మనుషులకోసం కొంత సమయం కేటాయించాలని ఈ సంవత్సరం ఆరంభంలో అనుకున్నాను. సంవత్సరం మొదట్లో కుటుంబంలో సంక్షోభంవల్ల అది వెనకపట్టు పట్టింది.

అనుకోకుండా ఈ యేడాది జూన్ లో ఒక స్నేహితురాలిదగ్గర్నించి ఒక ఆహ్వానం వచ్చింది. ఇక్కడ సౌత్ ఆస్ట్రేలియన్ రాష్ట్ర ప్రభుత్వం WIIT అనే సంస్థని నడుపుతూంది. Women In Innovation and Technology అనే పేరున్న ఈ సంస్థ ఆశయం- సైన్సూ ఇంజినీరింగూ చదివే ఆడపిల్లలకి వృత్తి సంబంధమైన గైడెన్సూ, చేయూతలనివ్వడం. ఇందుకని ఆ సంస్థ ఎగ్జిక్యూటివ్ కమిటీ సైన్సూ-ఇంజినీరింగూ వృత్తుల్లో వున్న స్త్రీలని రిక్రూట్ చేసుకుంటారు. ఒకో స్త్రీకి (mentor) ఒక్కో విద్యార్థినిని assign చేస్తారు. సాధారణంగా ఈ విద్యార్థినులు ఫైనలియర్ లోనో, ప్రీ-ఫైనల్ ఇయర్లోనో వుంటారు. అంటే ఇహ చదువు ముగించి ఉద్యోగం వెతుక్కోవడానికి సిధ్ధమవుతూ వుంటారన్నమాట.

యేడాది పొడుగూతా ఆ విద్యార్థిని చదువు సంధ్యలు స్థూలంగా పర్యవేక్షిస్తూ, ఉద్యోగాల గురించీ, ప్రొఫెషనల్ నెట్ వర్కుల గురించీ సలహాలిస్తూ, రెజ్యూమే రాయడం నేర్పించడం వంటి చిన్న చిన్న సహాయాలు చేస్తూ వుండాలి మెంటర్లు. అలాటి ప్రోజెక్టులో బీ.యెస్సీ మేథ్స్ చదువుతున్న వియత్నాంకి చెందిన ఒక అమ్మాయికి మెంటర్ గా వుండమని నన్ను అభ్యర్థించారు. సరేనని ఒప్పుకున్నాను. గత ఆరు నెలలుగా ఆ అమ్మాయిని నెలకు ఒకటి రెండు సార్లు కలుస్తూ మార్కుల గురించీ, చదువు గురించీ, ఫైనల్ ఇయర్లో చేయాల్సిన స్పెషలైజేషను గురించీ సలహాలిస్తూ వచ్చాను. ఇంకొక నెలలో పరీక్షలు కూడా అయిపోతాయి. (ఆస్ట్రేలియాలో విద్యా సంవత్సరం  ఫిబ్రవరి నుంచి నవంబర్ వరకూ వుంటుంది. డిసెంబరు- జనవరి అంతా ఎండాకాలం సెలవలు.)

ఆ అమ్మాయి మాటెలా వున్నా, ఈ అనుభవంతో నేను చాలా నేర్చుకున్నాను. అమ్మా నాన్నల్ని వదిలి దూర దేశంలో చదువుకునే విద్యార్థుల సాధక బాధకాలూ, వియత్నాం ప్రజల జీవితం తీరు తెన్నులూ, చాలా ఆసక్తికరమైన . సరిగ్గా ఆ అమ్మాయి మా మధు వయసుదే అవడం వల్ల, నాకు తనతో వ్యవహరించడం చాలా తేలికైంది. వచ్చే సంవత్సరం మళ్ళీ ఇంకో విద్యార్థినిని నాకు అలాట్ చేస్తారో లేదో తెలియదు. అది ఈ అమ్మాయి నా గురించి ఇచ్చే feedback, ఇంకా నా పని వత్తిడీ, తీరుబడీ లని బట్టి వుంటుంది. అయితే ఇంకా నన్నొక సందేహం బాధించింది.

నేను సాధారణంగా interact అయ్యే మనుషులతో నాకేదో ఒక విధమైన సంబంధం (common ground ) వుంటుంది. అసలు నాకేమాత్రమూ సంబంధంలేని మనుషులతో నా ప్రవర్తన ఎలా వుంటుంది? వాళ్ళకి నేను అవసరం వస్తే సానుభూతితో సాయపడగలనా?

అలాటి అనుభవం కోసం ఒక చిన్న fund raising event లో పాల్గొన్నాను. ఆ అనుభవం చాలా interestingగా, full filing గా అనిపించడంతో దాన్ని పంచుకోవాలన్న ఆలోచనే ఈ టపా. (అంతే కానీ, ఏదో నా గురించి గొప్పలు చెప్పుకోవాలన్న ఉత్సాహం కాదు…. J)

తల్లి గర్భంలోంచి నలభై వారాలకంటే ముందే పుట్టే ప్రీ-మెచ్యూర్ పాపలకి చాలా ఆరోగ్యపరమైన సమస్యలు వుంటాయి. అలాటి సమయంలో ప్రీ-మెచ్యూర్ పాపని కన్న తల్లికీ, తండ్రికీ, ఇంట్లో మిగతా పిల్లలకీ చాలా సహాయమవసరమవుతూంది. పెద్ద కుటుంబాల అండ వున్న మన దేశంలో అదంత పెద్ద సమస్య కాదేమోకానీ, ఇక్కడ ఆస్ట్రేలియాలో అలాటి క్లిష్ట సమయంలో ఆసరా దొరకడం కష్టం.

Life’s Little Treasure Foundation అన్న సంస్థ ఆస్ట్రేలియాలోని ప్రీ-మెచ్యూర్ పిల్లలకీ, కుటుంబాలకీ సహాయం చేయడానికి స్థాపించబడిన సంస్థ. నిన్న(27th October)  ఈ సంస్థ వాళ్ళు మా అందాల అడిలైడ్ లో ఒక fund raising family event ఏర్పాటు చేసారు. నేను రిజిస్ట్రేషనూ లాటి administrative  పనుల్లో నా వంతు సహకారాన్ని అందించాను. నాతో పాటు ఇంకో నలుగురమ్మాయిలూ పని చేసారు. ముక్కూ మొహం తెలియని వాళ్ళూ, అసలు నా చదువూ, ఉద్యోగాలతో ఎలాటి సంబంధమూ లేని వాళ్ళూ, బాగా చిన్న పిల్లలైన అమ్మాయిలతో కలిసి పని చేయడం చాలా ఎంజాయ్ చేసాను.

ఇరవై అయిదు, ఇరవై ఆరు వారాలకే పుట్టి గండాలన్నీ దాటుకుని ముద్దుగా పెద్దవాళ్ళవుతున్న పిల్లలనూ, వాళ్ళ తల్లి తండ్రులనూ చూడడం భలే మంచి అనుభవం. అయితే అందరు పిల్లలూ అంత అదృష్టవంతులు కాకపోవచ్చు. కొందరు మరణించిన పిల్లల ఙ్ఞాపకార్థం పావురాలని వదిలేసారు. యేడాదో, యేణ్ణర్థమో వున్న ఓ బంగారు జుట్టు బుజ్జిగాడు బల్ల మీద నాతో పోటీగా దరువేయడం అన్నిటికన్నా మంచి అనుభవం. మళ్ళీ వచ్చే సంవత్సరం ఇలాటి ఈవెంట్ కి కావాలంటే సహాయం చేస్తానని చెప్పి మధ్యాహ్నం ఇంటికొచ్చేసాను.

Image

అందాల నది టారెన్స్ ఒడ్డున..…….

Image

మంచి వాతావరణం కూడా తోడైతే

Image

పావురాల రెక్కల పైన….

3 thoughts on “పరోపకారార్థం…..

  1. బావుంది శారద గారూ!మన కోసమే కాక మరొకరి కోసం ఏదో ఒక పని చేస్తే, నిజంగా ఏదో చెప్పలేని శాంతి కలుగుతుంది.

    మీరిలాగే మంచి పనులు మరిన్ని చేయాలని …..!!

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s