శ్రీప ప్రియ సంగీతోపాసన……..

మా ఊళ్ళో శృతి-అడిలైడ్ సంస్థ అధ్వర్యం లో యేడాదికి రెండు లేదా మూడు కచేరీలు వుంటాయి. ఈ కచేరీలు చేసే కళాకారులు మెల్బోర్న్  సిడ్నీలకొచ్చే భారతీయ కళాకారులై వుంటారు.

అయితే రెండు మూడేళ్ళుగా  ఆస్ట్రేలియాలో స్థిరపడిన భారతీయ కళాకారులని కూడా పిలవడం అప్పుడప్పుడూ జరుగుతూంది. మెల్బోర్న్ వాస్తవ్యులు శ్రీ మురళీ కుమార్ గారి వయోలీన్ కచేరీ, సీడ్నీలో సంగీత పాఠశాల నడుపుతూన్న శ్రీమతి భవాని గోవిందన్ గారి కచేరీ, బ్రిస్బేన్ గాయనీ మణి శ్రీమతి సుష్మితా రవి గారి కచేరీ, ఇవన్నీ అలాటి కార్యక్రమాల్లో భాగాలే. ఇవన్నీ ఇండియానించొచ్చే పెద్ద పెద్ద కళాకారుల కచేరీలకేమాత్రం తీసిపోవు.

అలాటి ‘లోకల్ ఆర్టిస్టుల ‘ కచేరీ ఒకటి కిందటివారం ఇక్కడ ఇండియన్ అసోసియేషన్ హాలులో జరిగింది. పాడినవారు అడిలైడ్ వాస్తవ్యులు శ్రీమతి ఇంద్రకంటి భారతీ సుబ్రహ్మణ్యం గారయితే, ఆవిడకి మృదంగ సహకారాన్నిచ్చింది శ్రీ శివకుమార్ సేతుపతి, వయోలీన్ వాయించింది శ్రీ ముదిగొండ క్రాంతి కిరణ్ గారు. శివకుమార్ గారూ, క్రాంతి కిరణ్ గారూ సిడ్నీ లో వుంటారు.

శ్రీమతి భారతి గారు హైదరాబాదు ఆలిండియా రేడియో ఆర్టిస్టు. స్వర్గీయ శ్రీపాద పినాకపాణి, మహా మహోపాధ్యాయ శ్రీ నూకల చిన సత్యనారయణ గార్ల శిష్య పరంపరలోని వారు. చక్కటి గాత్రం, వినసొంపైన ఉఛ్ఛారణా ఆవిడ సొత్తు. ఇండియా, అమెరికా, ఆస్ట్రేలియా అంతటా ఆవిడ శిష్యులున్నారు. ప్రతీ శుక్రవారం సాయంత్రం, సత్సంగత్వే నిస్సంగత్వం   అనుకుంటూ, ఆఫీసు పని వొత్తిడినించి బయటపడి దాదాపు గంటసేపు, ఆవిడ బోధనలో సాధన చేసే అదృష్టమూ నాదే.

Image

నవంబరు పదిహేనున ఆవిడ ఏకబిగిన మూడు గంటలసేపు శ్రోతలని తమ గాత్రంతో కట్టి పడవేసారు. ఆ కచేరీలోని విశేషాలు కొన్ని-

  1. వర్ణం- పద్మ విభూషణ్ డాక్టర్ మంగళంపల్లి బాల మురళీ కృష్ణ గారు ఉత్తమ శ్రేణి సంగీతకారులే కాక వాగ్గేయకారులు కూడా. ఆయన శాస్త్రీయ సంగీతానికున్న సంప్రదాయానికి లోబడి వుంటూనే విభిన్నమైన ప్రయోగాలు చేసే ప్రఙ్ఞాశాలి. ఆయన కనిపెట్టిన రాగాలూ, తాళాలూ, గతి భేదాలూ, కీర్తనలూ, ఒక ఎత్తైతే, ఆయన రచించి స్వరపరచిన వర్ణాలు ఒక ఎత్తని స్వాభిప్రాయం.

సాధారణంగా వర్ణం లోని ముక్తాయి, చిట్ట స్వరాలకి సాహిత్యం వుండదు. వాటికి కూడా సాహిత్యం వున్న వాటిని ‘పద’ వర్ణాలంటారు. పద వర్ణాలన్ని చాలా వరకు నాట్య ప్రదర్శనల్లో వాడుతూ వుంటారు. ఆ రోజటి కార్యక్రమాన్ని భారతి గారు బాల మురళీ కృష్ణగారి అమ్మ- ఆనందదాయినీ అన్న గంభీర నాట వర్ణం తో మొదలైంది.

అకార ఉకార మకార రూపిణీ ‘అని అమ్మ వారినీ (అమ్మనూ!) వర్ణించే ఈ కీర్తనలో నాకన్నిటికంటే ఎక్కువగా నచ్చింది చరణం.

శివే శివే శివే, వేవేల వరాల రాశివే, మొరాలించు ‘ అని చనువుగా అమ్మవార్ని దబాయిస్తూనే,

అంతర్యాగమున నిను గొలిచి పురాకృత ఖలముల విముక్తునిగ

నేనైతి సకల శుభ గుణా, వినుత మునిగణావన గుణ, త్రిగుణాతీతా, విధి హరి గణపతి శరవణభవ శుక సనక అసుర సుర గణ రతిపతి సురపతి వినుత శివే, నిరతిశయ శివే, శివే పరమ..’

అన్న ముగింపు అద్భుతమనిపించింది. పురాకృత ఖలములనించి విముక్తి పొందటానికి అంతర్యాగము తప్పదు కదా?

2. ఆ తర్వాత మోహన కల్యాణిలో ముత్తయ్య భాగవతార్ విరచితం సిధ్ది వినాయకం సేవేహం‘, మాయా మాళవ గౌళలో మహారాజ స్వాతి తిరునాళ్ వారి దేవ దేవ కలయామి తే ‘, ఆనంద భైరవిలో శ్యామ శాస్త్రి వారి ‘ మరి వేరె గతి ఎవరమ్మా పాడారు.

3.  త్యాగరాజ స్వామి వారు తన మనసులో సంగీతానికి దాదాపు రాముల వారికిచ్చినంత స్థానం ఇచ్చారా, అనిపిస్తుంది కొన్ని సార్లు. బహుశా భక్తి యోగానికి అవసరమైన ఏకాగ్రత ఆయనకి సంగీతం లోనే కనిపించి ఉంటుంది. మనసునీ ఆత్మనీ కూడా ప్రక్షాళానం చేయగలిగే శక్తీ సంగీతానికి వుందంటే అతిశయోక్తి కాదేమో.

అఠాణ రాగంలో ” శ్రీప ప్రియ సంగీతోపాసన చేయవే ఓ మనసా,” అనే కీర్తన భారతి గారెత్తుకున్నప్పుడు, నాకు. “భగవంతుడికే సంగీతం ప్రియమైన ప్పుడు ఇహ మనమెంత,” అన్నట్టనిపించింది.

త్రితాప రహిత సప్త స్వరచారి,” అన్నాడాయన శ్రీహరిని.  శోభిల్లు సప్త స్వర సుందరులని,   సప్త స్వరాలనీ సుందరులతో పోల్చడమూ జరిగింది కదా! ఇప్పుడు ఆ సప్త స్వరాలలో శ్రీహరి సంచరిస్తున్నాడనడం ఎంత అందమైన భావన. ఇంతకీ త్రితాప రహితములైనవి సప్త స్వరములా, లేక ఆ సప్త స్వరముల సంచారియా?

రంజింప జేసెడి రాగంబులు మంజులమగు అవతారముల నెత్తి,” అని ఈయనంటే, “రాగాలనంతాలు నీ వేయి రూపాలు,” అన్నారు వేటూరి.  మనిషి సృష్టించుకొన్న రాగాలలో దైవం తనని తానే ఆవిష్కరించుకుంటాడన్న భావన ఎంత గొప్పది!అలౌకిక ఆనందాన్నిచ్చే అద్భుతమైన కీర్తన!

4. కుముదక్రియ- 51 వ మేళకర్త పంతువరాళి జన్యం. పంచమం లుప్తం చేసి మిగతా స్వరాలతో పాడాల్సిన రాగం. అద్భుత రసాన్ని చిలికించేందుకు వాడతారట. సృష్టిలో అర్థ నారీశరతత్వాన్ని వివరించేందుకు అద్భుత రసం కన్నా తగినదేముంటుంది? దీక్షితార్ వారి కృతి అర్థ నారీశ్వరం అలా కుముదక్రియలో ఒదిగిపోయింది.

5. “మా జానకి చెట్టబట్టగా..” కాంబోజి రాగంలో త్యాగరాజ కృతి. ఈ పాట జానకి చేత బట్టగా” అని పాడాలా అన్న వాద ప్రతివాదాలున్నాయి.

కాంబోజి రాగాలాపనకి విస్తారంగా పాడుకోవడానికీ చాలా అనుకూలమైన రాగం. అయితే పోపులో ఇంగువ ముక్కలా, మధ్య మధ్య కాకలి నిషాదం షార్ప్ గా తగిల్తేనే దాని అందం తెలిసేది.

ఆ రోజు భారతి గారు ఈ పాట నాకొక్కదానికే పాడినంతగా రసానుభూతి పొందాను నేను. (ఎలాగైనా, నాకు త్యాగరాజ కీర్తనలంటే కొంచెం ఇది. తేట తెలుగులో పదాల పొందిక చెడకుండా పాడినప్పుడు వాటిలోని అందమే వేరు….)

6. తర్వాత భారతి గారు, నీలాంబరిలో “శృంగార లహరి” (లింగరాజు గారు), తోడి లో “కరుణానిధి” (శ్యామ శాస్త్రి) విస్తారంగా పడారు.

అయితే ఆ రోజటి కచేరి హైలైటు మాత్రం రంజని రాగాల్లో రాగం తానం పల్లవి. రంజని రాగాల్లో అని ఎందుకన్నానంటే, ఈ పల్లవిలో అన్ని రకాలైన రంజని ప్రయోగాలూ వుంటాయి. రంజని లో రాగం తానం పాడిన తర్వా,త  ఖండ త్రిపుట తాళంలో “రంజనీ, కంజ దళ లోచనీ, బ్రోవవమ్మా, తల్లీ, నిరంజని ” అనే పల్లవిని అనేక రకాల రంజని రాగాల్లో  పాడారు. రంజని, శ్రీ రంజని, మేఘ రంజని, మనో రంజని, జన రంజని, శివ రంజని, కర్ణ రంజని, సుమనస రంజని రాగాలు సాధారణంగా వాడతారు. మధ్యలో శివ కుమార్ తని-ఆవర్తనం తో రక్తి కట్టించారు.  పెద్దా చిన్నా తేడాల్లేకుండా అంతా రంజని లో మునకలేసారు ఆ వేళ.

7.  రాగం తానం పల్లవి తరవాత ఖమాస్ లో “రామ నామ పానామృత” అనే కన్నడ పాటా, వసంత రాగం లో అన్నమాచార్య కీర్తన “వాడే వెంకటాద్రి మీద వర దైవము” పాడారు. కర్ణ రంజని లో తిల్లాన తో ఆనాటి కచేరీ ముగిసింది.

ఆనాటి కచేరీలో శివకుమార్, క్రాంతి కిరణ్ గార్లిద్దరూ మంచి కళ ప్రదర్శించారు. మూడు గంటలసేపు శ్రోతలెవ్వరూ కదలకుండా వినడం ఒక మంచి అనుభూతినిస్తే, అసలు ఏమాత్రం పబ్లిసిటీ లేక శ్రోతలు ఎక్కువ లేకపోవడం బాధనే మిగిల్చింది.

Image

 ————————————————————————–

[గమనిక: కచేరీ సమీక్ష కొంచెం క్లుప్తంగానే వుంది. దానికి కారణం ఒకటి గ్రంథ విస్తరణ భీతి అయితే రెండు గురువుగార్ని పొగిడే ధైర్యం లేక పోవడం. ఎవరికైనా ఈ సమీక్షలో ప్రస్తావించిన కీర్తనల గురించీ,రాగాల గురించీ వివరాలు కావాలంటే సంతోషంగా (నాకున్న మిడి మిడి ఙ్ఞానానికి) తెలిసినంతవరకూఇచ్చే ప్రయత్నం చేస్తాను.]

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s