దాదాపు రెండేళ్ళ క్రితం, అంటే డిసంబరు 2011 ప్రాంతంలో నేనింతవరకూ రాసినవీ, అక్కడక్కడా పత్రికల్లో వచ్చినవీ కొన్ని కథలతో ఒక సంకలనం వేయిస్తే మంచిదేమో అన్న ఆలోచన వచ్చింది. మా కుటుంబ సభ్యులూ, శ్రేయోభిలాషి శ్రీ సురేశ్ కొలిచాల గారి ప్రోత్సాహంతో కథల ఎడిటింగ్ మొదలు పెట్టాను.
ఆ పనిలో తల మునకలుగా వుండగానే హైదరాబాదులో మా అమ్మగారు అస్వస్థులవడం జరిగింది. ఆ తర్వాత ఒక ఏడెనిమిది నెలలు ఇంకే విషయం గురించీ ఆలోచించలేని ఒకలాటి మానసిక స్థితిలో ఆ పని మూల పడింది. తిరిగి డిసెంబరు 2012 ప్రాంతంలో అమ్మ కోలుకుంటున్న సూచనలు బలంగా కనపడడంతో మళ్ళీ పుస్తకం పని మొదలు పెట్టాము. జనవరి 2013 లో మామీద అనుకోని పిడుగు పాటు పడ్డట్టు అమ్మ మమ్మల్నొదిలి వెళ్ళిపోయారు. ఇక నాకే కథలూ వొద్దు, కథల పుస్తకాలూ వొద్దు అనే నిరాశలో నేను కృంగి పోతూండగా, సురేశ్, ఇంకా మా ఇతర కుటుంబ సభ్యులూ అనుకున్న పని పూర్తి చేయడమే మంచిదని ముందుకు నడిపించారు.
అన్యమనస్కంగానే పుస్తకాన్ని ప్రచురించి, ఇక్కడ అడిలైడ్ లో చార్ల్స్ స్టర్ట్ కౌన్సిల్ లో, మేయర్ కర్స్టెన్ అలెక్జాండర్ మిత్రుల సమక్షంలో 29 సెప్టెంబరు 2013 న ఆవిష్కరించారు. ఆ వివరాలూ, ఫోటోలూ అన్నీ నా దగ్గరే వున్నా, అసలా పుస్తకం గురించీ, ఆ ఆవిష్కరణ సభ గురించీ మాట్లాడడం కూడా ఇష్టం లేని మౌనంలో పడి కొట్టుకు పోతూ వున్నాను. అసలెప్పుడైనా రాద్దామని కూర్చున్నా ఒక్క అక్షరం కూడా ముందుకు సాగలేదు, ఎందుకో మరి.
ఆఖరికి, మిత్రులు శ్రీ నిడుమోలు ఉదయ్ భాస్కర్ ఆ సభ గురించీ, అక్కడ అందరి ప్రసంగాల గురించీ ఆయన అభిప్రాయం రాసారు. నా కథల పుస్తకానికి అభిమానం తో ముందు మాట రాసిన నిడదవోలు మాలతి గారికీ, పుస్తక ప్రచురణలో ఎప్పటికప్పుడూ దిగజారిపోతూ వున్నా పైకి లాగి ముందుకు నడిపించిన సురేశ్ గారికీ, ముఖ చిత్రం గీసి శ్రీ ఇచ్చిన చంద్ర గారికీ, కథలకి బొమ్మలేసి ఇచ్చిన శ్రీ రాజు ఏపూరి గారికీ, మా మామగారు శ్రీ రామకృష్ణన్ గారికీ, పుస్తకానికి వెనక అట్ట వేసి ఇచ్చిన మా చిరంజీవి అనన్యకూ, అందరికీ వేలవేల ధన్యవాదాలు. ఆవిష్కరణ సభకోసం ఎంతో ఆత్మీయంగా వీడియో సందేశం పంపిన శ్రీ నారాయణ స్వామి గారికీ, శ్రీమతి కల్పనా రెంటాల గారికీ కృతఙ్ఞతలు.
————————————————————————–
ఉదయ్ భాస్కర్ గారు రాసిన విశేషాలు:
‘నీలాంబరి- శారద కథల సంపుటి ఆవిస్కరన సభ విశేషాలు
శ్రీమతి శారద రచించిన కథల సంపుటి, ‘ నీలాంబరి’, సెప్టెంబరు 29, 2013 న దక్షిణ ఆస్ట్రేలియాలోని చార్ల్స్ స్టర్ట్ నగర గ్రంథాలయంలో నగర మేయర్ కెర్స్టన్ అలెగ్జాండర్ అధ్యక్షతన జరిగిన సభలో ఆవిష్కరించబడింది.
శోభాయమానంగా జరిగిన ఈ సభకు దక్షిణ ఆస్ట్రేలియా రాష్ట్ర Multi cultural affairs commision సభ్యురాలు భ్రోంకా కింగ్, ప్రవాస భారతీయ సంఘ (IAASA-Indian Australian Association of South Australia) ప్రతినిధిగా ఉపాధ్యక్షుడు శ్రీ నారాయణన్ రాయ్, స్థానిక తెలుగు సంఘం (TASA- Telugu Association of South Australia) అధ్యక్షులు శ్రీ యారా ఆదిరెడ్డి ఇంకా అనేకమంది సాహిత్య ప్రియులు విచ్చేసారు.
సభా కార్యక్రమం ప్రారంభమైన తర్వాత అమెరికాలో స్థిరపడ్డ ప్రముఖ తెలుగు రచయితలు శ్రీ నారాయణ స్వామి (నాసి) మరియు శ్రీమతి కల్పన రెంటాల వీడియో సందేశం ద్వారా నీలాంబరి కథలను పరిచయం చేసారు.
శ్రీ నారాయణ స్వామి మాట్లాడుతూ, నీలాంబరిలోని కథలు ఆధునిక సమాజంలో స్త్రీ పాత్ర, వారి బాధ్యతలు, కుటుంబమూ, కుటుంబ సభ్యుల మధ్య సంబంధ బాంధవ్యాలూ, తల్లి దండ్రులూ-పిల్లల మధ్య సంబంధాలూ, వారి పెంపకం వంటి వస్స్తువులతో ఆవిడ వ్యక్తిత్వాన్ని ప్రతిబింబిస్తాయన్నారు. ఆవిడ కథ నడిపే తీరు కథా విలువని మనసుకి హత్తుకునేవిధంగా ఆవిష్కరిస్తూంది. ఉదాహరణకు, “ఊహా చిత్రం” అనే కథ స్త్రీ-పురుష సంబంధాలను ఉదాత్తంగా వర్ణించే ప్రేమ కథ. “నీలాంబరి” తల్లికి కూతురు ప్రేమతో పట్టిన నీరాజనంగా ఆయన అభివర్ణించారు. శ్రీమతి శారద 1996 లో ప్రారంభించిన తన సాహిత ప్రయాణాన్ని ఇలాగే కొనసాగించాలనీ, మరిన్ని చక్కని కథలతో, సాహిత్య ప్రియులని సంతోషపరచాలని ఆకాంక్షించారు.
కల్పన రెంటాల తమ సందేశంలో
” శారద కథలలో స్త్రీలు అబలలు కాదు, ఆత్మ విశ్వాసంతో తల ఎత్తుకొని నడిచే అతివలు. మంచి ఆలోచనలతో కూడిన జీవితావగాహన, రాస్తున్న కథల పట్ల నిబధ్ధత, శైలి, శిల్పం భాష పట్ల మంచి పట్టు ఉన్న రచయిత్రి శారద” అని వ్యాఖ్యానించారు.
శ్రీ ఆదిరెడ్డి గారి తమ క్లుప్త ప్రసంగంలో దక్షిణ ఆస్ట్రేలియా తెలుగు సంఘం తరఫున శ్రీమతి శారదను అభినందించారు.
శ్రీ నారాయణన్ రాయ్ మాట్లాడుతూ, దక్షిణ ఆస్ట్రేలియా రాష్ట్ర చరిత్రలో ఒక తెలుగు పుస్తక ఆవిష్కరణ సభ జరగడం ఇదే తొలిసారి అనీ, భారతీయ సంతతి పౌరులు గర్వించదగిన విషయమనీ అభినందించారు.
ఆ నాటి ముఖ్య అతిథి నగర మేయర్ కెర్స్టన్ అలెగ్జాండర్ పుస్తకాన్ని ఆవిష్కరించారు. పుస్తకం మొదటి కాపీని స్థానిక ప్రముఖ వైద్యులు డాక్టర్ మోహన్ గారికి అందజేసారు.
మేయర్ మాట్లాడుతూ, ఇటువంటి సభను తమ నగర గ్రంథాలయంలో జరపటం తమకు ఎంతో గర్వంగా వుందన్నారు. భాషా, పుస్తకాలు సంస్కృతీ సంప్రదాయాలను నిలబెట్టడంలోను, ముందు తరాలకు మంచి విలువలను అందించటంలోనూ ఎంతో ముఖ్య పాత్ర వహిస్తాయని అన్నారు. సమాజంలో స్త్రీల హక్కులు, వాటి సాధన, మొదలైన అంశాలకు ప్రాధాన్యత కలిగినట్లయితే అది యావత్ సమాజానికి ప్రయోజనం కూరుస్తందని అభిప్రాయపడ్డారు. ‘నీలాంబరి’ లో కథల గురించి క్లుప్తంగా విని, ఇవి ఆంగ్లంలోకి తర్జుమా చేసినట్లయితే ఎందో ఆసక్తిగా చదవగలనని చెప్పారు.
శ్రీమతి శారద తమ ప్రసంగంలో సభికులకు తమ ధన్యవాదాలు తెలియచేస్తూ, 1996 నుండి మొదలు పెట్టిన తన సాహితీ ప్రయాణంలో ఎదురైన అనుభవాలు వివరించారు. తనను తాను అన్వేషించుకోవడానికీ, తనకూ చుట్టూ వున్న సమాజానికీ మధ్య వున్న సంబంధాల ఆసరాతో తనని తాను నిర్వచించుకోవడానికీ సాహిత్యాన్ని ఒక మాధ్యమంగా ఎన్నుకున్నానని చెప్పారు.
ఈ కథల సంపుటిని ఆవిడ తమ మాతృమూర్తికి అంకితమిచ్చారు. తన తల్లిదండ్రులు శ్రీమతి విజయలక్ష్మీ, శ్రీ నరసిం హారావు గార్ల ప్రేరణ, ప్రభావం, సాన్నిహిత్యమూ, ప్రేమా వాత్సల్యాల కారణంగానే, తాను మనిషిగా, స్త్రీగా, రచయిత్రిగా ఎదగగలిగానని అన్నారు.
శ్రీయుతులు మురళీధరన్ గారి స్నేహమూ, సహచర్యమూ, చిన్నారులు మధువంతి అనన్య ల ప్రేమాభిమానాలు వల్లనే ఈ పుస్తకం రూపు దాల్చిందని అన్నారు.
పుస్తక ప్రచురణకి ఎంతో తోడ్పడిన శ్రీ సురేశ్ కొలిచాల గారికి, సంపాదకులు శ్రీ వాసిరెడ్డి నవీన్, సీత గార్లకూ, ముఖ చిత్రం వేసిన శ్రీ చంద్ర గారికీ, కథలకు బొమ్మలు గీసిన శ్రీ రాజు గారికీ, ఆవిడ ధన్యవాదాలు తెలిపారు.అనంతరం చిన్న తేనీటి విందుతో సభ ముగిసింది.
ఈ సభని శ్రీమతి అనూష జాలాది చక్కటి తెలుగూ-ఆంగ్ల భాషల మేళవింపుతో నిర్వహించారు.
ఈ పుస్తకం హైదరాబాదులోని విశాలాంధ్ర బుక్ హవుస్ లోనూ, నవోదయా పబ్లికేషన్స్ లోనూ దొరుకుతుంది

Mayor Ms. Kirsten Alexandar,
Multicultural affairs commission representative Ms.Bronka King, Sharada, Smt Rama Mohan, Dr.Mohan
Better late than never.
కధ జీవిత ప్రతిబింబం కదా! దూర దేశం లో ఉండి కూడా తెనుగు సంస్కృతికోసం పాకులాడుతున్న మీ అభిరుచికి అభినందనలు. విశేషాలు బాగున్నాయి.
Professional and personal interests are demarked so well….
మొన్న శారద గారి కథలు “నీలాంబరి” ముందు మాట లో మాలతి గారు పుబ్బ లో పుట్టి మఖలో మాడి పోయే – అని రాసేరు.
మఖ పుబ్బ కన్నా ముందు వస్తుంది కదా.
శ్లేష గా వాడేరా? ప్రయోగమా?