బంగారానికి మెరుగు

ఎంత అందమైన బంగారు నగైనా మెరుగు పెడితేనే మెరుపొచ్చేది. ఎంత విలువైన వజ్రానికైనా సాన పెడితేనే ప్రకాశించేది. ఎంత అద్భుతమైన కళాకారుడైనా చెమటోడ్చి సాధన  చేస్తేనే కళావిష్కరణ జరిగేది.

అసలు కళాకారుడికి వచ్చే విలువా గుర్తింపూ కేవలం అతని జన్మ సంజాతమైన కళ వల్లేనా, లేక మిగతా హంగులవల్లనా అన్నది కూడా ప్రశ్నే. బంగారు పళ్ళేనికైనా గోడ అవసరమే కదా? మంచి చిత్రాన్ని మంచి ఫ్రేములో పెట్టకుంటే ఎవరూ గుర్తించరా? ఈ ప్రశ్నకి సమాధానం కోసం ఆ మధ్య (2007)  న్యూ యార్క్ నగరం లో ఒక చిన్న ప్రయోగం చేసారు.

జోషువా బెల్ ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన వయోలీన్ విద్వాంసుడు. పదిహేడేళ్ళకి పాశ్చాత్య శాస్త్రీయ సంగీతంలో కచ్చేరీలివ్వడం మొదలుపెట్టిన ఈయన గ్రామీ అవార్డు గ్రహీత. ఆయన కార్యక్రమాలకి యేడాది ముందుగానే టిక్కట్లన్నీ అమ్ముడు పోతాయిట. అయితే ఆయన కున్న జనాదరణా, అభిమానానికీ కేవలం వయోలీన్ వాదన మాత్రమే కారణం కాదనీ, అద్భుతమైన ఆడిటోరియంలూ, ఆయన కోసం నిరంతరమూ శ్రమించే పబ్లిక్ రిలేషన్ కార్యకర్తలూ, అతనికి సహకారాన్నందించే ఇతర ఆర్కేస్ట్రా సభ్యులూ కూడా నన్న విషయాన్ని నిరూపించడం కోసం వాషింగ్టన్ పోస్టు పత్రిక ఒక చిన్న ప్రయోగం చేసింది. (ఈ విషయం అందరు కళాకారులకీ వర్తిస్తుందన్నది వేరే చెప్పఖ్ఖర్లేదు.)

ఆ ప్రయోగం లో భాగంగా జోషువా ఒక బేస్ బాల్ కేప్ ని మొహం కనబడకుండా పెట్టుకుని వాషింగ్టన్  మెట్రో రైల్వే స్టేషన్లో ఒక మూల గా నిలబడి వయోలీన్ వాయించారు. హడావిడిగా పరుగులు తీస్తున్న జనం లో ఎంత మంది అతని సంగీతం వినడానికి ఆగిపోయారన్న విషయాన్ని రికార్డు చేసుకున్నారు.

JBell

ఆరోజు అక్కడ ఆయన ముప్పావు గంట వయొలీన్ వాయిస్తే, ఆ పాట వినడానికి ఏడుగురు ఆగిపోగా, సంపాదించిన డబ్బు దాదాపు ముఫ్ఫై డాలర్లు.  ఈ విషయం మీద అంతులేని వాదనలూ ప్రతి వాదనలూ చెలరేగయనుకోండి.

సంగీతం వినడానికి సమయమూ, అవకాశమూ,  ఆంబియన్సూ ముఖ్యం ” అని కొందరూ,

అసలు కళాకారులకి వచ్చే పేరు ప్రఖ్యాతులన్నీ మీడియా, సంగీత సభలూ కుమ్మక్కై చేసే సర్కస” ని కొందరూ, వ్యాఖ్యానించారు.

మొత్తం మీద చెప్పొచ్చేదేమిటంటే కళాకారుడికి పేరు ప్రఖ్యాతులూ, ఆత్మ తృప్తీ రావాలంటే కేవలం కళ మాత్రమే సరిపోదు.  చాలా పరిస్థితులు కలిసి రావడమూ జరగాలి.  అన్నిటికంటే లోపల్నించి తపనా, ఆ తపన వల్ల సాధనా లేనిదే ఎంత గొప్ప కళాకారుడికైనా కళా విష్కరణా, రస యోగమూ జరగదు. అంటే గొప్ప కళాకారులు పుట్టరు, తయారు చేయబడతారు.

ఈ విషయాన్నే కుండ బద్దలు కొట్టినట్టు చెప్పే సినిమా ” విప్ లాష్  “ (Whiplash).  సాధారణంగా ఈ మాటని కారు ప్రమాదాల్లో మెడకీ, ఎదుర్రొమ్ముకీ తగిలే దెబ్బ అనే అర్థం లో వాడినా, అసలు అర్థం “కొరడా దెబ్బ”. ఈ మధ్యే విడుదలైన ఈ సినిమాలోని సిధ్ధాంతంతో  నేను ఏకీభవించకపోయినా, కథా, చిత్రీకరణా,  సంగీతమూ నాకు చాలా నచ్చాయి.

Whiplash

న్యూ యార్క్ నగరం లోని ఒక విశిష్టమైన మ్యూజిక్ కాలేజీలో చదువుతూ వుంటాడు ఆండ్రూ నీమన్ (మైల్స్ టెల్లర్). జాజ్ సంగీతానికి సంబంధించిన  drums వాయించడం అతనికి జీవితాశయం.  అదే స్కూల్లో “స్టూడియో బేండ్” అనే గ్రూపు కి శిక్షణ ఇస్తూంటాడు టెరెన్స్ ఫ్లెచర్ (జె.కె.సైమన్స్) . విద్యార్థులని భయపెట్టడానికీ, కొట్టడానికీ కూడా వెనుకాడని మొరటుతనం అతని ప్రత్యేకత. తన శిక్షణలో ఆత్మ విశ్వాసం సడలిపోయి సంగీత ప్రపంచం నుంచి శాశ్వతంగా తప్పుకునే వాళ్ళున్నా, మిగిలిన వాళ్ళలోంచి చరిత్ర సృష్టించగలిగే సంగీతకారులు పుడతారన్న నమ్మకం అతనిది. ఇంగ్లీషు భాషలో పుట్టిన రెండు వ్యర్థమైన పదాలుగుడ్ జాబ్’” అంటాడు ఫ్లెచర్.

ప్రపంచంలో అందరి కంటే గొప్ప జాజ్ డ్రం ప్లేయర్ కావాలన్న ఆండ్రూ ఆశకీ, ఫ్లెచర్ మొరటుతనానికీ ఎలా పొసుగుతుంది? ఫ్లెచర్ ఉద్యోగం ఎందుకు ఊడిపోయింది? ఆండ్రూ మీద పగ తీర్చుకోవడానికి ఫ్లెచర్ ఏమి చేసాడు? దానిని ఆండ్రూ తిప్పి కొట్ట గలిగాడా లేదా? ఇవన్నీ సినిమాని (నిడివి గంటా నలభై నిమిషాలు) చాలా ఆసక్తివంతంగా చేస్తాయి

ఉత్సాహవంతుడిగా, కళాకారుడిగా టెల్లర్ చక్కటి నటన చూపించాడు. సైమన్స్ అక్కడక్కడా అతి అనిపించినా, తన పాత్రలోని చీకటి వెలుగులు సమర్థవంతగా వెలికి తెచ్చాడు. సంగీతం చెప్పలేనంత బాగుంది. జాజ్ గురించి ఎక్కువ తెలియని నాకే అంత బాగనిపిస్తే, ఇక జాజ్ వినేవాళ్ళకెంత నచ్చుతుందో! ఇంటిల్లి పాదీ కూర్చుని చూసుకునేంత శుభ్రంగా వుంది సినిమా. నిరభ్యంతరంగా పిల్లలని తీసుకెళ్ళొచ్చు. అయితే ఒక గమనికచిత్రం లోని భాష మహా అధ్వాన్నం. ప్రతీ పాత్రా వయోభేదం లేకుండ చెవులు చిల్లులు పడేలా బూతులు ప్రయోగిస్తుంది. కాబట్టి పిల్లలకి చూపించదలచుకుంటే విషయం ఆలోచించుకోవాలి.

జాజ్ సంగీతం పంతొమ్మిది ఇరవై శతాబ్దాలలో అమెరికాలో పుట్టింది. నిజానికి, దీన్ని మొదట్లో పాశ్చాత్య శాస్త్రీయ సంగీతం పట్టుబడని వారికోసమే అన్న చిన్న చూపు ఉండేదట. తర్వాత దీన్నిపాశ్చాత్య శాస్త్రీయ సంగీతం మీద ఆఫ్రికన్ల ప్రభావం తో పుట్టిన ఒక సంగీత రీతిఅని నిర్వచించారట. జాజ్ వినే వారందరికీ బ్లూస్ పేరు పరిచయమయే వుంటుంది. ఇంతకంటే జాజ్ గురించి నాకింకేమీ తెలియదు, మా ఇంట్లో మిగతా అందరూ వింటున్నా కూడా!

4 thoughts on “బంగారానికి మెరుగు

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s