నోబెల్ బహుమతి గ్రహీతా, డెభ్భై రెండేళ్ళ శాస్త్రఙ్ఞుడూ, foot-in-the-mouth అనే వ్యాధి గ్రస్తుడూ అయిన టిం హంట్ (Tim Hunt)ని కలిసిన వారెవరైనా వున్నారా? నేను కలిసాను. ఒకసారి కాదు, బోలెడు సార్లు. అయితే, ఆయన నా జీవితంలోకి వచ్చినప్పుడల్లా వేర్వేరు వేషాలతోనూ, మారు పేర్ల తోనూ వుండేవాడు. ఎలాగంటారా? ఈ గుండ్రాల వెంట తిరుగుతూ మీరూ నాతో పాటు రండి.
****
పాతికేళ్ళ కింద, ఎమ్మెస్సీ ఫిజిక్సు చదువుతూ మార్కుల కోసం యేడుస్తూ, సెంట్రల్ యూనివర్సిటీ ఫిజిక్స్ లాబ్ లో పగలూ రేయీ పడి వుండే రోజుల్లో, ఎవరో బంధువుల ఇంటికి ఎవరితోనో కలిసి వెళ్ళాను. గుమ్మం లోనే కుర్రకారు కేరింతలు కొడుతూ కబుర్లాడుతున్నారు. నన్ను వెంటతీసికెళ్ళిన వ్యక్తికి నన్ను వాళ్ళకి పరిచయం చేయక తప్పలేదు. వాళ్ళల్లో వున్నాడు టిం హంట్. సన్నగా పొడవుగా వున్నాడు. నా వైపు కుతూహలంగా చూసి, ” What are you doing? ” అన్నాడు. ఎమ్మెస్సీ, అన్నాను యెటూ తేలకుండా.
“ఏం సబ్జెక్టు” ఇంకా ఆరా తీసాడు.
“ఫిజిక్స్”
కనుబొమ్మలు ఆశ్చర్యంతో ఎగిరాయి.
” Why Physics?” అన్నాడు. అప్పటికి నాకూ చిరాకు మొదలయింది, ఆ వెటకారపు బాడీ లాంగ్వేజీ వల్ల కాబోలు.
“Why not Physics?” చురుగ్గా అడిగాను.
“అదంతా మగవాళ్ళ సబ్జక్టు కదా.” అప్పటికి నాకు నిజంగానే కోపం రావడం మొదలయింది, నేనూ వెటకారంగానే, “అయ్యో! నాకు తెలియనేలేదండీ, మగవాళ్ళ సబ్జక్టని. తెలిస్తే తీసుకునేదాన్నే కాదు,” అన్నాను. అందరూ నేనేదో జోక్ చెప్పినట్టు గొల్లుమన్నారు. అదే మొదలు నేనతన్ని చూడడం.
*********
ఎమ్మెస్సీ తరవాత ఒక ప్రభుత్వ రంగ సంస్థలో ట్రెయినీగా చేరాను. ట్రెయినింగు ముగిసి ఒకొక్కరం డివిజన్లూ సెలెక్టు చేసుకునే ముందు ఎవరో అన్నారు, “డాక్టర్ So and So తన డివిజన్లో అమ్మాయిలను చేర్చుకోరు తెలుసా?”
అది ఫిజిక్సు కి సంబంధించిన శాఖ కాకపోవడం వల్ల నాకేమీ ఆసక్తి లేకపోయినా, విషయమేంటని అందరినీ అడిగాను. “అబ్బా! అమ్మాయిలని పెట్టుకుంటే, ముందు పెళ్ళి చూపులకి సెలవడగతారు, తరవాత పెళ్ళనీ, ఆ తర్వాత మెటర్నిటీ నటీ లీవనీ, ఇహ అదొక అంతులేని కథ.వాళ్ళు తీసుకునే సెలవులెక్కువ,పని తక్కువ!”
అని అంటారని తెలిసినప్పుడు మా బాచి లో వున్న ముఫ్ఫై మంది ట్రెయినీ అమ్మాయిలం అవాక్కయ్యాం. ఇప్పుడున్న అనుభవమూ, లోక ఙ్ఞానమూ అప్పుడు లేవు. దాంతో అప్పుడు ఇలాటి attitudes కి ఎలా సమాధానమివ్వాలో అర్థమయ్యేది కాదు.
*************
ఆ తర్వాత నేను టిం హంట్ ని మళ్ళీ పదేళ్ళ తరవాత కలిసాను- ఆస్ట్రేలియాలో. ఒక కాంఫరెన్సు లో నా పక్కనే కూర్చున్నాడు. చాలా గొప్ప సైంటిస్టట, తనే చెప్పుకున్నాడు. తరవాత నా వొంక అయిదేళ్ళ పాపను చూసినట్టు చూస్తూ, ముద్దు ముద్దుగా, “ఇక్కడికి రాక ముందు మరి నువ్వేం చేసేదానివి? ” అన్నాడు. ఆ నవ్వుకీ, ఆ ప్రశ్నకీ, అన్నిటికీ నాకు బాగా అర్థం తెలుసు. ఇలాటి వారికి కీలెరిగి వాత పెట్టాలన్న నా సిధ్ధాంతానికి అనుగుణంగానే జవాబిచ్చాను. తేలిగ్గా నవ్వేసి,
“ఆస్ట్రేలియా రాకముందు నేను ఇండియాలో న్యూక్లియర్ సైంటిస్టుగా పనిచేసాను. మీకు న్యూక్లియర్ పవర్ అంటే తెలుసా? ఈ దేశానికి పెద్ద న్యూక్లియర్ పవర్ ప్రోగ్రాం ఏదీ వున్నట్టు లేదు, అందుకే మీకు బహుశా తెలిసి వుండకపోవచ్చు,” అన్నాను మెత్తగా. ఆ తర్వాత డిన్నరంతా మొహం అటే పెట్టుకున్నాడు. కాంఫరెన్స్ అంతా నన్ను తప్పించుకుని తిరిగాడు.
*********
This is the real man’s work we should be doing- not the girly stuff that we often do అనే రీసెర్చి లీడర్లలోనూ
టెక్నికల్ సమావేశాల్లో అడిగే ప్రశ్నలకి ఎటో చూస్తూ జవాబిచ్చే ఉపన్యాసకులలోనూ
ఈ మెయిలు లో కనీసం సంబోధించాలన్న సంస్కారం లేని సహోద్యోగులలోనూ
అందరిలోనూ టిం హంట్ కనబడతాడు మహిళా ప్రొఫెషనల్స్ కి.
అయితే వీళ్ళే కాదు-
ఇంటినీ, కుటుంబాన్నీ, వృత్తినీ సమన్వయపరచుకుంటూ, ఎలాటి హేళనల్నీ లెక్క చేయకుండా తమ విధి నిర్వర్తించుకుంటూ ఆడవాళ్ళు చేసే అష్టావధానాన్ని అర్థం చేసుకుంటూ, ఇంటా బయటా సహకరిస్తూ, శ్రమనీ, విజయాలనీ పంచుకుంటున్న సహచరులూ వున్నారు. లేకపోతే ఇదంతా సాధ్యమయేదే కాదు. అలాటి హితులూ, స్నేహితులూ, భాగస్వాములూ వున్నంతవరకూ,
ప్రపంచంలోని టిం హంట్ లందరికీ
బెబ్బెబ్బెబ్బె….
Brilliant!! This is a different angle to you, Sharada! Glad to see it, though!
Superb Sharada…it’s nice to read your post after a long time!
Brilliant post!
I have never experienced this “female” specific attitude – What I saw was a bias against non-American universities from some reasonably famous people and I was in “I don’t give a damn to your feelings. Some day, my work will speak for itself” mode not knowing what to do 🙂
చాలా బాగుందండి . ..న్యూక్లియర్ సైన్సెస్ లో మీ అనుభవం , టిం గార్కి మీరు ఇచ్చిన ఝలక్కు బాగుంది… నేను కూడా న్యూక్లియర్ సైన్సు బాక్గ్రౌండ్ నుంచేను. మీ ఈ అనుభవము ప్రతి మహిళ కి స్ఫూర్తిదాయకం. జై హో…థాంక్స్..:)
మీ ఈ టపా హంట్ కి టిం హంటే షికార్ అయ్యేడా 🙂
చాలా కాలం తరువాయి 🙂 బాగున్నారా ?
జిలేబి
బాగా చెప్పారు.. నేను పనిచేసే చోట ఇలాంటివి చూడలేదు కానీ, బయట మాత్రం చాలానే! ఏదో డబ్బులకోసమో, లేక పనీ-పాట లేక చేస్తూ ఉంటామనుకుంటారే తప్ప, వాళ్ళకి ఎన్ని వాతలు పెట్టినా వాళ్ళ బుధ్ధి మారదు