పదిహేడేళ్ళ కాలం చాలా పెద్దది. ఎంత పెద్దదంటే ఎనిమిది నెలల చిన్న పాపాయి మా అనూ , స్కూలు చదువు ముగించుకునేంత !
పదిహేడేళ్ళ కాలంలో మనం పెంచుకునే అనుబంధాలూ ఆప్యాయతలూ చిన్నవేమీ కావు. అవి వొదులుకొని దూరమవ్వాల్సినప్పుడు ఎంతో బాధ కలిగించేంత గాఢమైనవి.
అందుకే పదిహేడేళ్ళు మమ్మల్ని కడుపులో పెట్టుకొన్న అడిలైడ్ నగరాన్నీ, మా కష్ట సుఖాల్లో పాలు పంచుకుంటూ మమ్మల్ని గుండెల్లో దాచుకున్న స్నేహితులనీ వదిలి ఇంకో నగరానికి వెళ్ళాలన్న ఆలోచనే ఎంతో కష్టంగా అనిపించింది మొదట. మళ్ళీ ఆలోచిస్తే పుట్టి పెరిగిన దేశాన్నే వదిలి వొచ్చి ఇక్కడ నివాసం ఏర్పరుచుకున్నవాళ్ళం, మనకి ఇదొక లెక్కా అనిపించినమాటా వాస్తవమే.
కారణాలు ఏవైతేనేం, ఇక తప్పని పరిస్థితులలో ప్రయత్నం మొదలు పెట్టి మూడు వారాల క్రితం అడిలైడ్ నగరం లో మూటా ముల్లే సర్దుకొని బ్రిస్బేన్ నగరానికొచ్చి పడ్డాము. అదృష్టవశాత్తూ నా ఉద్యోగానికి ట్రాన్స్ఫర్ అవకాశాలు వుండడంతో తేలికగానే బదిలీ దొరికింది.
1999 లో మేము బెంగుళూరు వదిలి అడిలైడ్ వొచ్చినప్పుడు ఇంటి మీద బెంగతో, ఇక్కడ నిర్మానుష్యంగా వుండే వీధులు చూసిన భయంతో దాదాపు వారం రోజులు ఏక ధారగా ఏడ్చాను. అప్పుడు పరిచయమై మమ్మల్ని ఓదార్చి, ధైర్యం ఇచ్చిన స్నేహితులే కొద్ది వారాల కింద కన్నీళ్ళతో మమ్మల్ని సాగనంపారు.
“We will miss you, Murali and Sharada” అని మనస్ఫూర్తిగా అన్న స్నేహితులనీ, శ్రేయోభీలాషులనీ సంపాదించుకోవడం కేవలం మా అదృష్టమూ, దైవ కృప తప్ప ఇంకేవీ కాదు.
బిక్క మొహాలు వేసిన పిల్లలతో, “కొత్త చోటికి వెళ్తున్నామంటే పాత స్నేహితులని వదిలేస్తున్నామని కాదు అర్థం, కొత్త స్నేహితులని కూడా సంపాదించుకుంటామని,” అని సర్ది చెప్పామే కానీ, వొచ్చిన వారం రోజుల వరకూ సాయంత్రాలు కొంచెం దిగులుగా అనిపించిన మాటా నిజం. అంతకు ముందే చూసి పెట్టుకున్న ఇంట్లో దిగి, సామను సర్దుకొని, దారి తెన్నులూ చూసుకొని, ఆఫీసుకి వెళ్తూ వొస్తూ వుండడంతో కొంచెం బెంగ తగ్గింది.
అడిలైడ్ నగరానికి అంద చందాలలో ఏమాత్రమూ తీసిపోని బ్రిస్బేన్ జనాభా (ఇరవై లక్షలు) నిజానికి అడిలైడ్ జనాభా (పది లక్షలు)తో పోలిస్తే రెండు రెట్లెక్కువ.
జీవ శక్తితో తొణికిసలాడే సెంట్రల్ బిజినెస్ డిస్ట్రిక్టూ, అన్ని దిక్కులకీ మనుషులని చేరవేస్తూ నిరంతరం ప్రయాణించే రైళ్ళ వ్యవస్థా, నగరం మధ్యలో కూడా పచ్చటి చెట్లూ, విపరీతమైన ఉక్కా, చెమటా, బ్రిస్బేన్ నగర ప్రత్యేకతలు. నగర జీవితం ముంబాయి లాగనిపిస్తే, వాతావరణం కేరళ లాగనిపించింది. మురళీకి ఇంతకు మునుపే ఇక్కడ పరిచయమైన కుటుంబాలు వుండడంతో, కొంచెం తేలికగానే నిలదొక్కుకున్నాం.
అడిలైడ్ లో మౌంట్ లాఫ్టీ పార్కు ముచ్చట …….
బ్రిస్బేన్ లో స్ప్రింగ్ ఫీల్డ్ లేక్స్ సొగసు ………
ఇహ అడిలైడ్ ముచ్చట్లకి సెలవిచ్చి బ్రిస్బేన్ కబుర్లు మొదలు పెడదాం మరి-