అయితే ఈ పోస్టు షెన్ గురించి కాదు, అనన్య గురించి అసలే కాదు. వరుణ్ లాల్ గురించి! అతని పట్టుదలా, పరిస్థితులకి తలవంచని ధైర్యమూ చూసి మనమందరమూ ఎంతైనా నేర్చుకోవల్సి వుంది.
——————————————–
బ్రిస్బేన్ నగరానికొచ్చి యేణ్ణర్థం కావొస్తుంది. మంచి వాతావరణం, అనువైన ఉద్యోగం, అంతా బాగుంది, దేవుడి దయవల్ల.
బ్రిస్బేన్ నగరం లో సంగిత కార్యక్రమాలు ఎక్కవనే చెప్పాలి. వినడానికీ, పాల్గొనడానికీ చాలా అవకాశాలు దొరుకుతాయి. అయిటే, బ్రిస్బేన్ నగర విస్తీర్ణం వల్లా, ఇంకా అనేకానేక ఇతర కారణాల వల్లా, కార్యక్రమాల్లో శ్రోతల సంఖ్య కొంచెం నిరుత్సాహంగానే వుంటుంది.
ఈ కార్యక్రమాల వల్ల మాకు రెండు లాభాలు ఒరిగాయి. చాలా మంది ఆసక్తికరమైన వాళ్ళూ, స్ఫూర్తి నిచ్చే వాళ్ళతో పరిచయం, స్నేహం దొరకడం ఒకటైతే, మా పిల్లలిద్దరి గాత్రానికి లభించిన అంతులేని ప్రోత్సాహం రెండోది. పెద్దమ్మాయి ఇంజినీరింగ్ డిగ్రీ ముగించి సిడ్నీ నగరానికి వలస పోవడం వల్ల, ఇంత ప్రోత్సాహానికీ, ప్రశంసలకీ చిన్నది అనన్య సంతోషంగా హక్కుదారైంది.
బ్రిస్బేన్ సంగీత ప్రపంచంలో మేము కలిసి స్నేహితులమైన వారూ, అవుతున్న వారూ ఎంత మందో! వారిలో మొదట మాట్లాడుకోవలిసిన వారు శ్రీయుతులు షెన్ ఫిండెల్. షెన్ ఫిండెల్- బ్రిస్బేన్ లోని ఆశూ బాబా మెమొరియల్ తబలా పాఠశాల నిర్వాహకులు. స్వయంగా తబలాని అద్భుతంగా వాయించే ఆయన ప్రతి సంవత్సరమూ కనీసం రెండు నెలలు కోల్కత్తా నగరంలో గడిపి సాధన చేస్తారు. ఆయన శ్రీమతి యూకీ జపాన్ సంతతికి చెందిన యువతి. ధ్రుపద్ గాయకురాలు. ప్రతీ కార్యక్రమానికీ చక్కటి చీర కట్టూ, కాటుకా, బొట్టు పెట్టుకొని బుట్ట బొమ్మలా వచ్చే ఆ అమ్మాయి ఎంత ముద్దొస్తుందంటే, ప్రతీ సారి ఆ అమ్మాయిని కళ్ళప్పగించి చూస్తాను. ముద్దులు మూటగట్టే చిన్నారి సరస్వతి వాల్ల మూడేళ్ల కలల పంట.
షెన్ ప్రతీ సంవత్సరమూ సెప్టెంబరు మొదటి వారంలో ” సంగీత్ మేళా ” అనే పెద్ద సంగీత విభావరిని నిర్వహిస్తారు. ఈ కార్యక్రమంలో కర్ణాటక హిందుస్తానీ పధ్ధతుల్లో సంగీత కచేరీలూ, భారతీయ సాంప్రదాయ నృత్య కార్యక్రమాలూ వుంటాయి.
మధ్యాహ్నం రెండు నించి రాత్రి తొమ్మిది వరకూ జరిగే ఆ కార్యక్రామాల్లో ఆస్ట్రేలియా ఇతర రాష్ట్రాలనుంచీ, ఇండియా నుంచీ వచ్చే కళాకారులని వినొచ్చు/చూడొచ్చు. సంగీత్ మేళా కార్యక్రమంలో భాగంగా ఔత్సాహిక విద్యార్థులకు “సంగీత్ ప్రేమి- Rising Stars ” అవార్డు కూడా ఇస్తారు. కిందటి యేడు సంగీత్ మేళా కార్యక్రమంలో మేము శ్రీమతి చారులతా మణి గారి గానమూ, శ్రీ శుభేంద్ర రావు- శ్రీమతి సస్కియా రావు గార్ల సితార్-చెల్లొ వాద్య కచేరి విన్నాము. ఆ అనుభూతి మాటల్లో వర్ణించడానికి సాధ్యం కానిది.
ఈ సంవత్సరం కూడా ఈ కార్యక్రమానికి శ్రీమతి నిర్మలా రాజశేఖర్ మొదలైన హేమా హేమీలంతా వస్తారని విన్నాము, ఎదురు చూస్తున్నాము.
షెన్ దగ్గర చాలా మంది విద్యార్థులు తబలా నేర్చుకునేందుకు వస్తారు.. వారందిరితో షెన్ యేడాదికి రెండు సార్లు సంగీత కార్యక్రమాలు నిర్వహిస్తారు, స్కూల్ డే లాగ. అందులో ఆయన గురువు శ్రీ అశుతోష్ బాబా స్మారకార్థం జులై నెలలో గురు పూర్ణిమ సందర్భంగా BEMAC (Brisbane Multicultural Arts Centre లో పెద్ద యెత్తున ఒక కార్యక్రమం చేస్తారు.
ఆ కార్యక్రమంలో తబలా విద్యార్థులకోసం మా మురళీధరన్ గారి వేణు గానమో, శ్రీ జోసెఫ్ అభయానంద్ గారి హార్మోనియమో వుంటుంది. అయితే ఈ సారి తబలా కార్యక్రమాన్ని ప్రారంభించటానికి మా చిన్నది అనన్య ని పాడమని కోరారు.
అనన్య క్రితం సంవత్సరం (2016) లో Rising Star అవార్డు గెలుచుకున్నప్పట్నించీ షెన్ అంతులేని వాత్సల్యానికీ, అదరణకీ నోచుకుంది. “చక్కటి కంఠం (melodious voice)” అని ఎప్పటికప్పుడూ అందరికీ అనన్యని పరిచయం చేసే వారి దీవెనలు మా చిరంజీవి కి ఎప్పుడూ వుండాలని మా ప్రార్థన.
అయితే ఈ పోస్టు షెన్ గురించి కాదు, అనన్య గురించి అసలే కాదు. వరుణ్ లాల్ గురించి!
వరుణ్ లాల్ షెన్ దగ్గర చిన్నప్పట్నించీ తబలా నేర్చుకున్న యువకుడు. అనూప్ జలోటా వంటి లబ్ద ప్రతిష్ఠులకే తబలా సహకారం అందించిన కళాకారుడు. 2008 లో జరిగిన ఒక ప్రమాదం ఇతని జీవితన్ని పెను విషాదంలో ముంచి వేసింది. ఆ ప్రమాదం లో అతను తీవ్రంగా గాయ పడి, శరీరంలోని దాదాపు అన్ని భాగాలపైనా స్వాధీనం కోల్పోయాడు, ఒక్క కుడి చేయి తప్ప. గత తొమ్మిదేళ్ళుగా ఏ మాత్రమూ సహకరించని శరీరంతో అతను ఒక్క చేయి మాత్రం ఉపయోగించి తబలా సాధన చేసే ధీశాలి అతను.
కిందటి శనివారం జులై ఎనిమిదో తారీకున జరిగిన కార్యక్రమంలో అతను గురువుగారైన షెన్ తో కలిసి ఒక్క చేతితో తబలా వాయించాడు. అమ్మా నాన్నలు దగ్గరుండి నడిపించి తీసుకొచ్చి కుర్చీలో కూర్చోపెడితే, తబలాలో వుండే ఒక పక్క వాద్యాన్ని ఒళ్ళో పెట్టుకొని, షెన్ ఇంకో పక్కనించి సహకరిస్తూండగా తబలా వాయించాడు.
ఆ వాదన ఎలా వుందన్నది అసంగతం. కానీ అతని పట్టుదలా, పరిస్థితులకి తలవంచని ధైర్యమూ చూసి మనమందరమూ ఎంతైనా నేర్చుకోవల్సి వుంది. చిన్న చిన్న కారణాలకే డిప్రెషన్ ల తో కుంగిపోతూ, ప్రతి సమస్యనీ భూతద్దంలోంచి చూసి సెల్ఫ్-పిటీ లో పడి కొట్టుకుపోయే వాళ్ళందరికీ అతని జీవితమొక గుణ పాఠం. ఒక్క చేత్తో తబలా వాయించీ, ప్రతీ విన్యాసం తరవాత చేయి పైకెత్తి “బల్లే బల్లే” అని అరుస్తాడు పెద్ద నవ్వుతో! ఆడిటొరియం అంతా అతనితో గొంతు కలిపింది. మాట కూడా దాదాపుగా పడిపోయిన అతనికి వొచ్చేది ఆ ఒక్క పదమే!
గుండె నిండా ధైర్యమూ, సాహసమూ వున్న మనిషికి బ్రతుకంతా “బల్లే బల్లే” నే కదా? ఏమంటారు?
(షెన్ గురించీ, సంగీత్ మేళా గురించీ వివరాలకోసం ఇక్కడ చూడండి. http://www.sangeetmela.org )