నాకు చిన్నప్పుడు సినిమాల్లో హీరో లేదా హీరోయిను మానసిక సంఘర్షణ అద్దంలో చూపించే సీన్లు భలే నచ్చేవి.
జమున ఒక చిన్న గుడ్డల మూటతో ఇల్లు దాటి వెళ్ళబోతుంటే , అద్దంలో ఒక జమున వొచ్చి, పెద్ద స్పీచీ ఇచ్చి, “ఆగు వెళ్ళకు,” అని సలహా ఇస్తుంది. సరే అని, జమున ఏదో ఆలోచించుకునేలోపే ఇంకొక జమున ప్రత్యక్షమై “నీకేమైనా పిచ్చా? దాని మాటలు వింటావే? బానే వుంది, నడు నడు,” అని మళ్ళీ బయల్దేరదీస్తుంది. నిజం జమున డిబేటింగ్ కాంపిటీషన్ లో జడ్జీ లాగా, ఇద్దరినీ మార్చి మార్చి అయోమయంగా చూస్తూ వుండేది, అచ్చం నాలాగే.
అలాగే హీరో కూడా ఒక పెద్ద నిర్ణయం తీసుకోబోయే ముందు, అద్దంలో రెండు ఈగోలూ వచ్చి నానా రచ్చా చేసేవారు. ఒక ఈగో, తెల్ల కుర్తా పైజామాలో, తల దువ్వుకుని, సౌమ్యంగా, “త్యాగం చేయడమే నువ్వు చేయాల్సిన పని, నీ బాధ్యతా,” అంటూ ఊదరగొట్టేస్తే, రెండో ఈగో రేకిష్ గా, జుట్టంతా నుదుటి మీద పడుతూ, కొంటెగా ఒక బల్ల మీద కూర్చుని, “నాన్సెన్స్! అర్థరాత్రి ఏమిటీ న్యూసెన్స్? నీ స్వార్థం నువు చూసుకొని సుఖపడకుండా ఈ సోదంతా ఏమిటి?” అని దుమ్ము రేగ్గొట్టేది. వాళ్ళిద్దరిలో ఎవరు గెలుస్తారోనన్న ఆత్రం నన్ను నిలవనిచ్చేది కాదు ఆ వయసులో.
ఇప్పుడిదంతా ఎందుకంటే, నాకు నాలోనూ అలాటి ఆల్టర్ ఈగో వుందని డౌటనుమానం. అయితే కొన్ని తేడాలు వున్నాయి.
ఒకటి, నా ఆల్టర్ ఈగో (ఆ.ఈ) ప్రత్యక్షం కావడానికి అద్దంతో ఏమాత్రం అవసరం లేదు. ఎక్కడైనా, ఎప్పుడైనా, ప్రత్యక్షమయ్యే రకం. ఇంకొకటి, హీరోయిన్ కి ఇద్దరు ఈగోలు ప్రత్యక్షమైతే, నాకు ఒక్కటే ఆల్టర్ ఈగో . మరి ఈవిడ తెల్ల చీర సౌమ్యం బాపతా, రంగుల చీర రౌడీ బాపతా అంటే, సందర్భాన్ని బట్టి వుంటుందన్నమాట. లెట్ మీ ఎక్స్ ప్లైన్!
అద్దం లేకుండా ఎక్కడ పడితే అక్కడ, ఎప్పుడు పడితే అప్పుడు ప్రత్యక్షమయ్యే నా ఈ ఆల్టర్ ఈగోది ఒకటే ధ్యేయం. నేను ఎడ్డెమంటే తెడ్డమనడం! నా మనసులో పుట్టిన ప్రతీ ఆలోచననీ వెక్కిరించడం, ఎద్దేవా చేస్తూ ఎగతాళి చేయడానికే ఈవిడ నాకు ప్రతీ సందు మలుపులోనూ తగుల్తుంది.
ఉదాహరణకి, నడుస్తూంటే రోడ్డు మీద ఎవరో ఏదో సాయం అడిగారనుకుందాం. నేను వాళ్ళడిగిన చిన్న సాయం చేసి, “అబ్బ! నువ్వెంత మంచిదానివే శారదా! పరోపకారం కోసమే పుట్టావమ్మా నీవు,” అని మురిపెంగా నన్ను నేనే మెచ్చుకుంటూ వుంటా కదా? అప్పుడు నల్ల చీరలో ప్రత్యక్షం నా ఆల్టర్ ఈగో!
“ఓయబ్బో! బయల్దేరావులే మహా! ఇంత చిన్న విషయానికే మురిసి ముక్కలవుతున్నావే? నువ్వసలు ఎంత పచ్చి స్వార్థపరురాలవో నాకు తెలియదనుకోకు,” అంటూ మొదలు పెట్టి, నేను ఎప్పుడెప్పుడు, ఎవరెవర్ని నా పనులకి వాడుకున్నదీ తేదిలతో సహా వివరాలు చెప్పి నన్ను బిక్క చచ్చి పోయేలా చేస్తుందన్నమాట.
అలాగని, ప్రతీ సారీ అంతే అనుకునేరు! కొన్నిసార్లు తెల్లని పూల చీర కూడా కట్టుకొస్తుంది. పొద్దున్నే లేచి, నా మనసు, “లే! సోమరిపోతా! ఎంత సేపా నిద్ర? వాకింగ్ కి వేళ్ళేదేమన్నా వుందా లేదా, దున్నపోతా!” అని సుప్రభాతం పాడుతూ నన్ను లేపుతున్నప్పుడు, చక్కగా తల దువ్వుకొని, మంచి పూల చీర కట్టుకోనొస్తుంది, నా ఆ.ఈ., “అబ్బా! ఇవాళ వాకింగ్ పోకపోయినా పరవా లేదులే! కొంచెం రెస్టు తీసుకో! తీరిక లేకుండా పని చేస్తే, డల్లైపోతారెవ్రైనా,” అంటూ అనునయిస్తుంది. అంతా కళాకళల వ్యవహారం.
ఇంతకీ ఇప్పుడు ఈ ఆ.ఈ. వల్ల వచ్చిన సమస్యేంటంటే, దీనివల్ల నాకొక ఐడెంటిటీ క్రైసిస్ లాటిది వొచ్చిపడింది. నాకు నా మనసులో ముందుగా వచ్చిన ఆలోచన నేనా, లేక నా ఆ.ఈ. అభిప్రాయమే నేనా అన్నది ఎటూ అర్థం కాకుండా పోయి, పర్మనెంటుగా అయోమయం మొహం పడిపోయింది.
అంటే ఇప్పుడు నేను ఆస్తికురాలినో, నాస్తికురాలినో నాకే తెలియనంత కంఫ్యూజను.
“రేపు రామనవమి, పొద్దున్నే లేచి, స్నానం చేసి, మడిగా, శుచిగా వండి స్వామికి నైవేద్యం చేయాలి ” అని ఒక ఆలోచన రాగానే, ఇంకొక కర్ణ కఠోరమైన గొంతు, “ఓ యబ్బో! నిజంగా భగవంతుడున్నాడనీ, వుంటే రాములవారిలాగానే వుంటారనీ, వుండి నీ నైవేద్యాలు తినేసి నీకు అడిగిన వరాలిచ్చేస్తాడనీ, ఎలా తెలుసు? అసలు భగవంతుణ్ణి నమ్మి మొక్కులు మొక్కే నీలాటి సైంటిస్టులని ఉరి తీయాలి. పెద్ద చదువులు చదివింది, మళ్ళీ!” అంటూ ఒక రేంజిలో నాతో ఆడుకుంది.
ఆ తరవాత కృష్ణాష్టమికి చడీ చప్పుడు లేకుండా ఒక పాయసంతో సరిపెడదామనుకున్నానో లేదో, “హవ్వ! నువ్వింత పెడెకట్టెలాగుంటే ఆ పిల్లలకేం నేర్పిస్తావే నీ బొంద! అందుకే ఆ ఆడపిల్లలిద్దరికీ రాముడికీ కృష్ణుడికీ తేడ తెలియదు. ఆ మధ్య రాముడి తండ్రెవరని అడిగితే, దుర్యోధనుడని చెప్పింది నీ చిన్న బంగారం,గుర్తుందా? పండగ పూట కాస్త దీపం వెలిగించి, నైవేద్యం చేసి పిల్లలతో ఒక రెండు పాటలు పాడించు. తరవాత బాధపడి లాభం లేదు మరి,” అంటూ ఆగకుండా సణిగింది. నేను పడలేనమ్మా ఈ పేచీకోరు ఆ.ఈ. తో!
సైకియాట్రిస్టుకి చూపించుకుందామా, లేకపోతే భూత వైద్యుణ్ణి పిలుద్దామా అని ఆలోచిస్తున్నాను.
అయితే ఏ మాటకామాటే చెప్పుకోవాలి-
అనవసరంగా పిల్లల మీదో, ఇంటాయన మీదో విరుచుకు పడే ముందు, అలసటతో ఎవరితోనైనా మర్యాద తప్పి మాట తూలే ముందు, సమస్యల్లో చిక్కుకొని నిరాశలో కృంగిపోయే ముందు, ఆవేశంలో తప్పుడు నిర్ణయం తీసుకొనే ముందు, ఇదిగో ఈ ఆల్టర్ ఈగో నే చేయి పట్టుకొని ఆపి,” ఓయ్! ఏమిటా తొందర? ఆగు మరీ,” అని నన్ను రక్షించిన సందర్భాలూ వున్నాయి మరి.
మరందుకే ఆల్టర్ ఈగో ని వదలకుండా గారాబం చేస్తున్నానేమో. ఆ గారాబంతో ఏకు మేకై, ఆ.ఈ. ఇప్పుడు నా అంతరాత్మ కింద చలామణీ అవుతోంది. ఊరుకోకుండా మాటి మాటికీ ప్రబోధిస్తూ వుంటుంది.
మీరే చెప్పండి, అంతరాత్మ ప్రబోధం సీరియస్ గా తీసుకోని వాళ్ళెవరైనా వుంటారా?
****
Hilarious post👌👌👌
ధన్యవాదాలు,నీహారిక గారూ.
చాలా బాగుంది.
అంతరంగం యొక్క సున్నితమైన భావాలను చాలా హృద్యంగా చిత్రీకరించావు.
ఒక విషయం గుర్తుకొస్తుంది….,
MSc లో ఉన్నప్పుడు Part time husband రాసిన హోతా పద్మినీ దేవి పై నువ్వు ఆవేశంగా ఏదో అంటే you start writing అని నేనన్నాను.
ఈ రోజు ఇంత మంచి writings చూస్తున్నాను.
Keep it up.
Thanks మురళీ. మన చర్చలన్నీ నీకెంత బాగా గుర్తున్నాయి! అప్పట్లో అర్థం కాని ఆవేశం ఒకటి వుండేది. ప్రోత్సాహానికి ధన్యవాదాలు. మరి మిగతావి కూడా చదివెయ్యి.
You have nice way of expression, funny about alter ego, you are proud about Indian tradition, be proud to teach your tradition, don’t be carried away by ‘don’t give a lecture mummy’ , good luck
ఎంత సరదాగా చెప్పారండీ. నవ్వలేక చచ్చాను 🙂
చంద్రిక గారూ,
ధన్యవాదాలు
—మీరే చెప్పండి, అంతరాత్మ ప్రబోధం సీరియస్ గా తీసుకోని వాళ్ళెవరైనా వుంటారా?
ఉండరండీ 🙂
జిలేబి
అంతేగా అంతేగా !!