నర జాతి చరిత్ర సమస్తం…..

వ్యక్తులుగా, కుటుంబాలుగా,సమూహాలుగా, పరిణితి చెందిన సమాజాలుగా, దేశాలుగా ఎదుగుతున్నామని అనుకుంటున్న మనం, మన తోటి మనుషులతో వ్యవహరిస్తున్న తీరు కొంచెం తరచి చూసుకుంటే సిగ్గు కలగక మానదు.

ప్రపంచానికే స్వయం ప్రకటిత పెద్దన్న అమెరికాలో ఈ సంవత్సరం మేలో జాత్యహంకార హత్య జరిగింది. దాని ప్రభావమూ, “BLM” ప్రదర్శనలూ అందరూ ఎరిగినవే. దరిమిలా అన్ని దేశాలూ, సంఘాలూ, సమాజాలూ తమ తమ చరిత్రలనీ, ప్రవృత్తులనీ సమీక్షించుకోవలసిన పరిస్థితి కూడా ఏర్పడింది. కడుపు చించుకుంటే కాళ్ళ మీద పడుతుందని తెలిసినా, వెనక చూపు తోనే కదా మనుషులం పాఠాలు నేర్చుకొని ముందడుగు వేసేది?

ఆస్ట్రేలియా దేశ చరిత్ర కూడా ఇందుకు మినహాయింపేమీ కాదు. సామ్రాజ్య వాదుల వలసల పద ఘట్టనలో తమ ఉనికినీ, సంస్కృతినీ, భాషలనూ, ప్రాణాలనూ, మాన మర్యాదలనూ, అన్నిటినీ కోల్పోయి జీవచ్చవాల్లా బ్రతుకుతున్న ఎబోరిజీన్ల గురించి, భూమ్మీదనించే మటుమాయమైపోయిన స్థానిక తెగల గురించీ కొన్నేళ్ళ కింద ఇక్కడ ప్రస్తావించాను.

దాదాపు మూడు వందల యేండ్ల సంఘర్షణా, జులుం, హింసా సహించిన స్థానిక తెగలకు శ్వేత జాతీయుల వలస పాలకుల వల్ల జరిగిన నష్టాన్ని ఆస్ట్రేలియా ప్రభుత్వం ఇరవైయవ శతాబ్దం చివరిలో (1997 ప్రాంతం) ఒప్పుకుంది. స్థానికులైన ఎబోరిజీన్ల తెగల మీద తాము జరిపిన హింసాకాండకు క్షమార్పణగా “Welcome to the Country” అంటూ ప్రతి కార్యక్రమాన్ని మొదలు పెట్టడం ఆనవాయితీగా మారింది. ఈ ఆనవాయితీ ప్రకారం ఎటువంటి కార్యక్రమాన్నైనా మొదలు పెట్టేముందు “ఈ దేశానికి స్వాగతం. ఈ ప్రదేశాన్ని తరతరాలుగా తమ నివాసంగా మార్చుకున్న తెగలకూ, వారి నాయకులకూ, వారి సంస్కృతులకూ ధన్యవాదాలూ,” అంటూ స్థానిక తెగల పేర్లు ఉటంకిస్తూ, వారిని తలచుకోవాలి. (ఈ Welcome to the Country గురించి చెప్పుకోవడానికి చాలా వుంది, అది ఇంకెప్పుడైనా). ప్రతీ సంవత్సరం మే 26 ని “నేషనల్ సారీ డే” గా గుర్తించడం మొదలైంది.

ఫిబ్రవరి 13, 2008 న మొదటిసారి ఆస్ట్రేలియా ప్రభుత్వం పార్లమెంటు ముఖంగా రెండు శతాబ్దాలకు పైగా అణగారిపోయిన తెగలకూ జాతులకూ క్షమాపణ చెప్పుకుంది. ఈ క్షమాపణ విషయంలో కొందరు శ్వేత జాతీయుల అభిప్రాయాలూ, వాదనలూ వింటూంటే వాళ్ళ మొరటు మనస్తత్వానికీ, అహంకారానికీ రక్తం మరగక మానదు. ఈ క్షమార్పణలూ, విద్య, ఉద్యోగాల్లో రిజర్వేషన్లూ, ఇంకా ఎన్నెన్నో రాయితీలు వున్నా, ఎబోరిజీన్ల పరిస్థితి ఇంకా దయనీయంగానే వుంది. ఆరోగ్యమూ, ఆయుర్ధాయమూ, జీవన పరిస్థితీ, ఇవన్నిటితోపాటు, పోలీసు జులుం కూడా వాళ్ళ మీద తక్కువేమీ కాదు.

1980 లో పదహారేళ్ళ పీటర్ పేట్ మరణం తో ఆస్ట్రేలియాలో ఎబోరిజీన్ల మీద పోలీసు జులుం పైన వ్యతిరేకత మొదలైంది. 1987 లో ప్రభుత్వం ఈ విషయాన్ని విచారించడానికై ఒక రాయల్ కమీషన్ (Royal Commission into Aboriginal Deaths In Custody) ని నియమించింది. వీరు 1991 లో సమర్పించిన నివేదికలో, “నిజానికి కస్టడీలో మరణాల సంఖ్య శ్వేత జాతీయులకీ, ఎబోరిజీన్లకీ సమానంగానే వుంది. కానీ, మొత్తం జనాభాలో కేవలం 2-3 శాతం వుండే ఎబోరిజీన్లు జైళ్ళలో, కస్టడీలో దాదాపు ఇరవై శాతం వున్నారు. మనం ముందుగా దిద్దాల్సింది దీన్నే. అవిద్య, అశుభ్రత, వ్యసనాలూ, వ్యభిచారం, నేరాలూ వీటన్నిటి వల్ల సరైన దిశా నిర్దేశనం లేక ఎబోరిజీన్ల సంఘం నేరాలకీ, తద్వారా జైళ్ళకీ గురవుతున్నారు,” అని అభిప్రాయ పడ్డారు.
అయితే ఈ కమీషన్ అబోరిజీన్ల బాగుకోసం చాలా దాదాపు మూడు వందల సూచనలు చేసింది. అందులో, ఈ గణాంకాలను ప్రభుత్వం ప్రతీ సంవత్సరమూ శ్రధ్ధగా గమనించాలనీ, వారి జీవితాలని మెరుగు పరచటానికి తగిన చర్యలు తీసుకోవాలనీ సూచించింది.
ఈ కమీషన్ నివేదిక సమర్పించిన తరవాత, గత ముఫ్ఫై యేళ్ళలో దాదాపు నాలుగు వందల మందికి పైగా ఎబోరిజీన్లు పోలీసు కస్టడీ లో మరణించిన మాట నిజం. కానీ వారిలో చాలా మందివి సహజ మరణాలేనంటుంది ప్రభుత్వం. కాదంటారు ఎబోరీజీన్ ఏక్టివిస్టులు. మరి ఎవరిది నిజమో అన్నది దైవ రహస్యం!

“Black Lives Matter” అంటూ పోటెత్తిన అమేరికాతో పాటు ఆస్ట్రేలియా నగరాల్లో కూడా “Aboriginal Lives Matter” అంటూ నిరసనలూ, ప్రదర్శనలూ చేపట్టారు. అయితే ఆ గొంతుకలెంతదాకా వినిపించాయో మరి !

[ఈ విషయం గురించి ఇంకా చదవాలంటే ఇక్కడ, ఇంకా, ఇక్కడ చూడండి].

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s