పులి కడుపున పులే పుడుతుందా?

పులి కడుపున పులే పుడుతుందా?

(Like Mother Like Daughter – Elle Croft – ఒక సమీక్ష)

క్రితం సంవత్సరం ఒక సినిమా చూసాము. “గొప్పవాడి కడుఫున గొప్పవాడే పుడతాడు, తక్కువ వాడి కడుపున తక్కువ వాడే పుడతాడు,” అనే ముతక సందేశాన్ని చిత్ర విచిత్రమైన కథతో చెప్పిన ఆ సినిమా చూసి, వార్నీ, అనుకున్నాను. ఒక మనిషి వ్యక్తిత్వం రూపు దిద్దుకోవడంలో జెనెటిక్ కోడింగ్ దే ముఖ్య పాత్ర అని చాలామంది నమ్ముతారు కూడా.

కానీ,”పులి కడుపున పులే పుడుతుంది,” అని సెలవిచ్చిన మన పెద్దలే, “ఏ గూటి చిలక ఆ గూటి పలుకు పలుకుతుంది,” అని కూడా అన్నారు. అంటే, “నేచర్”, “నర్చర్” కీ వున్న సున్నితమైన తేడా గురించి మన పెద్దలు ఆలోచించే వారన్నమాట.

సరిగ్గా కిందటి సంవత్సరమే, సిద్ధార్థ ముఖర్జీ రాసిన “The Gene” అనే పుస్తకం నా చేతికొచ్చింది. చాలా అద్భుతమైన పుస్తకం. జన్యు శాస్త్రంలో జరిగిన పరిశోధనలూ, ఫలితాలూ, సమాజంలో వాటి ప్రభావాలూ చాలా విశదంగా, సరళంగా వివరించే ఆ పుస్తకం లో మనిషి వ్యక్తిత్వం నాలుగు పాయల జడ లా సూత్రీకరించారాయన.

(గమనిక- నాలుగు పాయల జడ అన్నది నా వ్యక్తీకరణ, ముఖర్జీ గారిది కాదు.)

స్థూలంగా చెప్పాలాంటే, వ్యక్తిత్వం (ఫీనోటైప్) నాలుగు విషయాల కలయిక. జన్యువులు (జీనోటైప్), చుట్టూ వున్న పరిస్థితులు (ఎన్వైరన్మెంట్), ట్రిగ్గర్, సంభావ్యత (ప్రాబబిలిటీ).

phenotype=genotype + environment+ trigger + chance

నాలుగు కలిసి ఒక హంతకుడి సంతానం హంతకులే అవుతారో, మేధావి సంతానం మేధావులే అవుతారో నిర్ణయిస్తాయన్నమాట. అంటే తల్లి నుంచో, తండ్రి నుంచో సంక్రమించిన లక్షణాలు (జీనొటైప్) బిడ్డలో వ్యక్తమవాలంటే, ఆ జన్యువులకు చుట్టూ వున్న పరిస్థితులూ అనుకూలించాలి. అలా పరిస్థితులు కలిసొచ్చినా, ఆ లక్షణాలు బయటపడడానికి ఒక ట్రిగ్గర్ వుండాలి. ఇవన్నీ వున్నా, ఆ లక్షణం వ్యక్తమవుతుందా అన్నది సంభావ్యత పైనే ఆధార పడి వుంటుంది.

పది గింజలని తీసుకొని, అన్నీ అనుకూలిస్తే, దీన్లో ఎన్ని మొలకెత్తుతాయని అడిగితే,”ఏడు” అనో, “ఆరు” అనో చెప్పగలం. “ఏ ఆరు?” అని అడిగితే చెప్పలేం. పోనీ, ఒక గింజని తీసి, “ఇది మొలకెత్తుతుందా?” అంటే నిర్ధారణగా చెప్పలేం. అంతా “స్టాటిస్టిక్స్ దేవత” చేతిలో వుందన్నమాట.

The Gene పుస్తకం గురించి ఆలోచన తెగనే లేదు, ఇదే విషయాన్ని గురించి ఇంకో పుస్తకం చేతికొచ్చింది. మళ్ళీ, “స్టాటిస్టిక్స్ దేవత” మాయ.

[The Gene ఒక అద్భుతమైన పుస్తకం. ఆ పుస్తకం గురించి చెప్పుకోవడానికెంతో వుంది, అది ఇంకోసారి.]

                                                   ***********

సాధారణంగా నేను లైబ్రరీలో కొన్నిసార్లు చేతికందిన పుస్తకం పట్టుకొచ్చి దేవుడి మీద భారం వేసి చదవడం మొదలు పెడతాను. అలాగే ఒక నెల రోజుల కింద లైబ్రరీలో పచార్లు చేస్తూండగా, “లైక్ మదర్ లైక్ డాటర్” అనే పుస్తకం నా దృష్టిని ఆకర్షించింది. ఏదో తల్లీ కూతుర్ల సంబంధాన్ని గురించిన నవల అనుకుని చేతిలోకి తీసుకున్నాను.

“మా అమ్మకి మేం ముగ్గురు కూతుర్లం, నాకిద్దరు కూతుర్లు. తల్లీ కూతుర్ల సంబంధాలలో నాకు తెలియని విషయాలా,” అని ఒక లాటి అతిశయంతో పుస్తకం చదవటం మొదలు పెట్టాను.

కథ మొదట్లో కేట్ బ్రైడ్ వుడ్ అనే స్త్రీ స్కూల్లో వున్న తన కూతురు ఇమోజెన్ కొరకు కార్లో ఆందోళనతో వెళ్తూ ఉంది.

ఉన్నట్టుండి కొన్ని వీధులపేర్లు చాలా సుపరిచితంగా అనిపించాయి. ఇంకొన్ని పేజీల్లో అర్థమైపోయింది, ఆ కథా స్థలం అడిలైడ్ అని. భలే ఆశ్చర్యపోయాను, ఎక్కడో మారు మూల వుండే అడిలైడ్ ని కూడా కథా స్థలంగా రాసే వాళ్ళున్నారా అని.

ఆ తరవాత నవలంతా ఏకబిగిన చదివేసాను. నేరాలూ, సస్పెన్సూ వాటికంటే మనస్తత్వ శాస్త్రం గురించిన చర్చ వుంది కథలో. కథలో వున్న స్త్రీలందరూ తమ తమ వైపు నుంచి కథ వినిపిస్తారు.

                                                                    **************

కేట్, డిలన్ అడిలైడ్ లో నివసించే మధ్య తరగతి దంపతులు. వారికి ఇమోజెన్, జెమైమా అనే ఇద్దరు కూతుర్లు. పిల్లలకోసం చాలా యేళ్ళు యెదురు చూసి ఆశ వదిలేసుకుని, ఇమోజెన్ ని దత్తత తీసుకుంటారు. ఆ తరవాత కొన్నేళ్ళలో వాళ్ళకి జెమైమా పుడుతుంది.

సంతోషంగా సాగే వాళ్ళ జీవితంలో కేట్ కి వున్నది ఒక్కటే బెంగ. ఇమోజెన్ గురించి.

ఇమోజెన్ ని వాళ్ళు చాలా విచిత్రమైన పరిస్థితిలో దత్తత తీసుకుంటారు. ఇమోజెన్ తల్లి తండ్రులిద్దరూ సైకో కిల్లర్లు. తమ కడుపున పుట్టిన పిల్లల్నే చంపే విపరీతమైన నేర ప్రవృత్తి వున్న వాళ్ళు. ఇమోజెన్ వొంట్లో ప్రవహించేదీ తన తల్లి రక్తమే. ఇమోజెన్ కూడా తల్లి తండ్రుల్లా వికృతమైన మనసు కలిగి వుంటే? చుట్టూ వున్న వాళ్ళని హింసించి, చంపేసే ప్రవృత్తి కలిగినదైతే? తన పెంపకం ఆ జెనెటిక్ కోడింగ్ ని ఓడించగలదా?

ఇలాటి అనుమానాలతో స్కూల్ నించి ఇమోజెన్ గురించి కంప్లైంటు వచ్చినప్పుడుల్లా కేట్ భయంతో గజగజా వణికిపోతుంది. డిలన్ మాత్రం తమ పెంపకం పైన నమ్మకంతో ఎటువంటి ఆలోచనలూ పెట్టుకోకుండా, టీనేజీలోకి వచ్చిన పెద్ద కూతురిని కనిపెట్టుకొని వుంటాడు.

వున్నట్టుండి ఇమోజెన్ ని తన గత జీవితం లోని ఒక పాత్ర పలకరిస్తుంది.  తన గతం గురించి ఏ మాత్రమూ తెలియని ఇమోజెన్ ఆ పలకరింపుతో ఆందోళన చెందుతుంది. ఆ పలకరింపు నుండి కేట్ కూతుర్ని రక్షించుకునే ప్రయత్నం చేస్తుంది.

ఇంతకీ ఇమోజెన్ లో తల్లి రక్తం ప్రవహిస్తోందా? తల్లి జన్యువులా,  పెరిగిన కుటుంబ వాతావరణమా, ఏది ఇమోజెన్ వ్యక్తిత్వాన్ని నిర్దేశిస్తాయి? మానసిక రోగీ, నేరస్థురాలి కడుపున ఇంకో మానసిక రోగీ, నేరస్థురాలే పుట్టిందా? వీటన్నిటికంటే పెద్దదైన ఆ కుటుంబ రహస్యం ఆఖర్న గొప్ప ట్విస్టు ఇస్తుంది. ఆ ట్విస్టు తో పాటు, దీనికి కొనసాగింపు కూడా వుంటుందేమో అనిపిస్తుంది ఆ ముగింపు చదివితే.

ఈ నవల రాసిన ఏల్ క్రోఫ్ట్ అడిలైడ్ లో పుట్టి పెరిగారు. ప్రస్తుతం లండన్లో నివాసముంటున్నారు. ఇదే కాక, ఈవిడ ది గిల్టీ వైఫ్,  ది అదర్ సిస్టర్ అనే ఇంకో రెండు నవలలు రాసారు.

                                          *************

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s