అసలెందుకు?

అసలెందుకు?”, ఈ ప్రశ్న మనం చాలా సార్లు వేసుకుంటాం.

ఉద్యోగం ఎందుకు చేస్తున్నాం, కుటుంబాన్ని ఎందుకు చూసుకుంటున్నాం, లాటి ప్రశ్నలకి సమాధానం తేలికే. కానీ, “పుస్తకం చదవడం ఎందుకు?”, “మంచి సినిమా అయితే మాత్రం, చూడకపోతే యేం?”, “ఇప్పుడా పాట నేర్చుకోకపోతే ఎవరికి నష్టం?” లాటి ప్రశ్నలకే, సమాధానం వెతకడం దాదాపు అసాధ్యం.

చాలా సార్లు (దాదాపు ఎప్పుడూ), నేను మోటివేషన్ లేమితో బాధపడుతూ వుంటాను. ముఖ్యంగా రాయడం విషయంలో. ఎక్కడో ఏదో మంచి ఆలోచన తడుతుంది. దాన్ని అందరితో పంచుకోవాలన్న ఆశా పుడుతుంది. చిలవలూ, పలవలూ గా ఆ ఆలోచన శాఖోపశాఖలుగా విస్తరించి నా కంటికే అందంగా, రంగురంగులతో కనిపిస్తుంది. నాకింకా ప్రపంచం మీద ప్రేమ చావలేదు కాబోలు, దాన్ని నా బ్లాగులోనో, కథలోనో రాసేసి ప్రపంచానికి చెప్పెయ్యాలనిపిస్తుంది.

కానీ నా బ్లాగు నేను తప్ప ఎవరూ చదవరనీ, ఫేసు బుక్కులో నాకున్న ఫాలోయింగు దాదాపు శూన్యమనీ, కథలు వర్గాల మధ్య కుంపట్లు పెట్టడానికే తప్ప ఆత్మావిష్కరణకి కాదనీ, ఇలాటివే ఇంకా చాలా చేదు నిజాలు తెలిసిన నా అంతరాత్మ అడ్డుపడుతుంది.

అవున్నిజమే, అసలెందుకు?

చాలా మంచి పుస్తకం చదివాను. ఆ పుస్తకం నాలో చాలా ఆలోచనలు రేకెత్తించింది.

అయితే? ఇప్పుడది రాసి తీరాలా? అసలెందుకు? ఎవరి కోసం?

మోటివేషన్ చచ్చిపోయిన నా మెదడు వేసే వేషాలివన్నీ!

ఈ అవస్థలో నేను సతమతమవుతూ వుండగా, మురళీ ఒక యూ-ట్యూబ్ వీడియో గురించి ప్రస్తావించారు. కుతూహలం కొద్దీ ఆ వీడియో నేనూ చూసాను. చాలా ప్రశ్నలకి సమాధానం లభించినట్టే అనిపించింది.

                                             ****************

Campbell Waker సిడ్నీకి చెందిన ఇరవై యెనిమిదేళ్ళ యూట్యూబరు. Struthless అనే పేరుతో కళనీ హాస్యాన్ని మేళవించి ప్రస్తుత రాజకీయ సాంఘిక వ్యవస్థ మీద వ్యాఖ్యానాలు చేస్తూ వుంటారు. సహజంగానే ఆస్ట్రేలియన్లకి హాస్య ప్రియత్వం (sense of humour) చాలా యెక్కువ. ఆఫీసుల్లో సీరియస్ మీటింగుల్లో కూడా గొల్లున నవ్వులూ, చాలా నవ్వించే మాటలూ వినబడకుండా వుండవు. వాకర్ కూడా చాలా సునిశితమైన హాస్యమూ, వ్యంగ్యమూ కలిపి మంచి విషయాలు చెప్తారు.

అతని వీడియో “The drawing advice that changed my life” నిజంగా నా ఆలోచనలను చాలా మార్చింది.

స్థూలంగా చెప్పాలంటే..

వాకర్ కి ఒక గురువు మార్క్ ఒక చిన్న కీలకమైన రహస్యం చెప్తారు. వాకర్ స్వతహాగా బొమ్మలూ కార్టూన్లూ వేసినా ఎప్పుడూ తన కళ పట్ల పెద్ద సంతోషంగా లేడు. ఈ విషయాన్ని తన గురువు తో చెప్పుకున్నాడు.

“రోజూ పది పనులు చేసేకంటే, ఒకే పనిని రోజూ చేయాలి,” అనే మంత్రాన్ని ఉద్బోధిస్తాడు మార్క్.

“అయితే రోజూ మిగతా అన్ని పనులు మానేసి బొమ్మలు మాత్రమే వేస్తాను,” అన్నాడు వాకర్.

“బొమ్మలు కాదు- బొమ్మ – ఒక్కటే బొమ్మ వేయి. ప్రతీ రోజూ, యేడాది పాటు ఒక్కటే బొమ్మ!” మళ్ళీ ఉద్ఘాటించారు.

ఒక్కటే బొమ్మా? ఏం బొమ్మ వేయాలబ్బా అని ఆలోచనలో పడ్డాడు వాకర్. ఆఖరికి ఐబిస్ బొమ్మ వేయాలని నిశ్చయించుకున్నాడు.

ఐబిస్ ఆస్ట్రేలియా ప్రాంతంలో కనబడే పక్షి (Australian White Ibis). ఎక్కువగా చెత్త డబ్బాల్లో తిండి వెతుకుతూ తిరుగుతూ వుండే పక్షి. అందుకే దీన్ని బిన్ చికెన్ (bin chicken) అని కూడా అంటారు.

(ఐబిస్ పక్షి బొమ్మ గూగుల్ సౌజన్యం – శారద)

మనందరం ఐబిస్ పక్షి లాటి వాళ్ళమే. ఎగరడానికి రెక్కలూ, అంత పెద్ద ఆకాశమూ వుండగా, చెత్త డబ్బాలు పట్టుకు తిరిగేది మనిషి మనస్తత్వం కాకపోతే మరేమిటి?”, అంటాడు వాకర్.

సరే, ఐబిస్ బొమ్మ గీయడం మొదలు పెట్టాడు. ప్రతీ రోజూ, రకరకాలుగా, రకరకాల రంగుల్లో, విసుగెత్తినా ఐబిస్ ని గీయడం మానలేదు. తరవాత మెల్లి మెల్లిగా ఐబిస్ తో కార్టూన్లు, కథలూ, వ్యాఖ్యానాలూ, ఇన్స్టాగ్రాము ప్రఖ్యాతి, యూట్యూబులో సందడీ అదంతా వేరే కథ.

ఆ వీడియోలో వాకర్ ఇంకొక ఆసక్తికరమైన విషయం చెప్తారు. ఈ విషయం బహుశా అందరికీ ఇదివరకే తెలిసుండొచ్చు. నా వరకు నాకు, మొదటిసారి వినటం చాలా ఉత్సాహాన్నిచ్చింది.

“మనందరమూ ఎక్కణ్ణుంచో ఇన్స్పిరేషనూ (ప్రేరేపణ), మోటివేషనూ వొచ్చేస్తాయనీ, అది రాగానే మన పని మొదలుపెట్తొచ్చనీ, ఎదురు చూస్తూ, ఆలోచిస్తూ గడిపేస్తాం. ఒక రోజులో చాలా భాగం ఇలా ఆలోచనల్లో, స్ఫూర్తి కోసం, ప్రేరేపణ కోసం , ఎదురుచూపుల్లో గడిపేసాక, హమ్మయ్య, ఇవాళ చాలా కష్టపడ్డాను, అనుకొని సంతోషపడతాం కూడా. నిజానికి మనం ఆలోచనల్లో, ఎదురుచూపుల్లొ చేసేది పని కాదు, కేవలం కాల హరణం. మోటివేషన్ వచ్చింతరవాత పని మొదలుపెట్టడం కాదు, పని మొదలుపెడితేనే మోటివేషన్ వొస్తుంది,” అంటారు వాకర్.

                                                                       ************

ఆ యూట్యూబు లో వున్న సందేశానికి ఇంకొంచెం జత చేసి,

“వేరే ఆలోచనలు పెట్టుకోకుండా, నీకిష్ట మైన పనిని, క్రమం తప్పకుండా చేయి,” అని అన్వయించుకుంటే, ఎన్నో విషయాలు అర్థమైనట్టనిపించింది. “కర్మణ్యేవాధికరస్తే, మా ఫలేషు కదాచనః” అని గీతాచార్యుడు చెప్పిందే కదా!

అయితే. “ఒకటే పనిని, ఇంకే ఇతర విషయాలూ ఆలోచించకుండా, క్రమం తప్పకుండా చేయడం”, అన్నది ఎంతో మానసిక క్రమశిక్షణతో కూడిన విషయం. క్రమం తప్పకుండా చేయడం అన్నది ఒకటైతే, ఫలితాన్ని గురించి ఆలోచించకపోవడం అనేది వుందే, అది చాలా సాధన వల్లే వచ్చే ఒక మానసిక స్థితి.

ఏ నిర్దుష్టమైన ఆశయం (viable end goal) లేకుండా ఒక పాట నేర్చుకోవడానిక్కాని, రెండు పేజీలు రాసుకోవడానిక్కానీ, చాలా మెంటల్ డిసిప్లిన్ అవసరం. అదే, ఒక పుస్తకం చదవడమో, పిల్లలకి ఒక పాట నేర్పించడమో, ఒక సినిమా చూడడమో తేలిక. ఎందుకంటే వాటిల్లో మానసిక విశ్రాంతి అనే కోణం వుండడం తో పాటు, అటువంటి పన్లు తేలిక. (పుస్తకం చదవడానికీ, నాలుగు పేజీలు రాసుకోవడానికీ వున్న తేడా చెప్పనక్కర్లేదు).

మోటివేషన్ తగ్గడానికి బహుశా ఇవన్నీ కారణాలై వుండొచ్చు. చెయాల్సిన పనిలో దాగున్న కష్టం, ఎడతెగక ప్రశ్నిస్తూ అడ్డు తగులుతూ వుండే మనసు, చుట్టూ వున్న రకరకాల డిస్ట్రాక్షన్సూ. వీటిల్లో అన్నిటినీ తగ్గించలేకపోయినా, మనసు వేసే ప్రశ్నలని కొంచెం అదుపులో పెట్టుకోవచ్చేమో. అప్పుడు మోటివేషన్ కొంచెం కొంచెం పెరగొచ్చు.

“అసలెందుకు” అనే ఆలోచనే లేకపోతే చేసే పనిని నిదానంగా, శ్రధ్ధగా, నిష్కామంగా చేయగలుగుతాం. పైన చెప్పినట్టు మోటివేషన్ పెంచుకోని పని చేయడం కాదు. పని చెస్తూ, మోటివేషన్ పెంచుకోవడం అసలైన పధ్ధతి. తద్వారా లభించే మానసిక శాంతిలో, ప్రశ్నలడిగే మనసు మూగపోతుంది.

ప్రశ్నలే లేనప్పుడు, ఇక సమాధానాలెందుకు?

One thought on “అసలెందుకు?

  1. Namaste andi, nenu mee blogs chaduvuthoo untaanu, almost 7 years nunchi anukontaa. EErozu meeru raasina asalenduku anedi andariki eppudo oka saari anipisthundi anedi satyam. Iam not an exception, Meeru Bhagavad Gita Vyakhyanm vinandi , Telugu or in English. Chalaa manchi videos unnayi. Or Mana Garikiipati gaarivi ledaa Chaganti gaari videos chudandi on motivation. All your/our questions were answered 1000s years ago by our rishis. Nothing is new and strange for us. This is not vedaantam, this is our way of life. You will feel so relaxed and get clarity after watching just 5/6 videos of them.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s