వార్తలకెక్కని మనుషులు

                                                          2017 డిసెంబరు మొదటి వారం

హైదరాబాదులో బంధువుల ఇంట్లో పెళ్ళికని కుటుంబమంతా ఇండియా వొచ్చాము. పెళ్ళి తరవాత పిల్లలిద్దరూ ఉత్తర భారతదేశ యాత్ర చేయాలని సరదా పడితే, రాజస్థాన్ అంతా తిరిగి చూసాము. జైపూర్, జైసల్మేర్, ఉదయ్ పూర్ నగరాలు చూసి చాలా సరదాగా గడిపాము ఆ సెలవులు

రాజస్థాన్ కొంచెం వెనకబడిన ప్రాంతంగా, స్త్రీల పట్ల నేరాలలో మొదటి స్థానాలలో వున్న రాష్ట్రంగానే తెలుసు. నిజానికి ఉత్తర భారతం అంతా నేర మయమేనని మనకి కొంచెం భయంతో కూడిన చులకన కూడా. కాబట్టి ఆ ట్రిప్పు వేయడానికి నేను కొంచెం వెనకాడినా, పిల్లలూ మురళీ చాలా సరదా పడ్డారు. సరే, అన్ని చోట్లా, కారూ, డ్రైవరూ, వసతీ సౌకర్యంగా వుండేటట్టు ఏర్పాటు చేసుకొని బయల్దేరాము.

రాజస్థాన్ లో నేను ముందుగా గమనించినవి రెండు విషయాలు. రాష్ట్ర రాజధాని అయిన జైపూర్లో కూడా, రోడ్ల మీద పెద్ద పెద్ద వ్యాపార ప్రకటనలతో హోర్డింగ్స్ ఎక్కువగా కనపడవు. మన హైదరాబాదులో నగలూ, చీరల హోర్డింగ్స్ తో పిచ్చెత్తి పోయి వున్న నాకు, అది కొంచెం వింతగా అనిపించింది. ఆలోచించి చూస్తే అది స్థూలంగా రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకూ, అక్కడ ప్రజల పేదరికానికీ అద్దం పట్టినవి.

రెండో విషయం, వీధుల్లో చాలా తక్కువగా వున్న స్త్రీ సంచారం. అసలే చలికాలం, బయట నర సంచారమే తక్కువ. స్త్రీలు బయట నడవడం దాదాపు చూడనేలేదు. మళ్ళీ అక్కడ స్త్రీల పట్ల నేరాల గణాంకాలు గుర్తొచ్చి గుండెలు గుబ గుబమన్నాయి నాకు. ఇద్దరు ఆడపిల్లలతో ఏ ఆపదా రాకుండా ఈ ట్రిప్పు దాటించు దేవుడా అని వేడుకున్నాను.

మమ్మల్ని జైపూర్ నించి జైసల్మేర్, ఉదయ్ పూర్ తీసికెళ్ళడానికి గులాబ్ సింగ్ అనే డ్రైవరు వొచ్చాడు. సన్నగా, పొడవుగా, చామన చాయ లో, పెద్ద నవ్వు మొహం కాదు. నమస్కారం చేసి, ముభావంగా సామానంతా కార్లో సర్ది ప్రయాణం మొదలు పెట్టాడు. అక్కడక్కడా చూడాల్సిన ప్రదేశాలు ఓపిగ్గా  చూపించాడు, సలహాలిచ్చాడూ, కానీ, అవసరమైతే తప్ప మాట్లాడలేదు.

సాయంత్రం అయిదవుతూ వుండగా జైసల్మేర్ దారిలో అతనికొక ఫోనొచ్చింది. రాజస్థానీ భాషే అయినా హిందీని బాగా పోలి వుండడంతో నాకు బాగా అర్థం అయింది. ఎవరినో ఆరు గంటలకి తయారుగా వుండమని, తను సరిగ్గా ఆ స్థలానికొచ్చేస్తాననీ చెప్తున్నాడు.

అసలే ఓవెర్ ఇమేజినేషన్ తో పదో గేరులో పని చేస్తున్న నా మెదడు గిర్రున తిరిగింది. ఎవర్ని రమ్మంటున్నాడు ఆరు గంటలకి? ఎందుకు? అసలు మేము క్షేమంగా ఇల్లు చేరతామా లేదా? భయంతో పిచ్చెత్తి పోయిందంటే నమ్మండి.

మెల్లిగా వొంగి కింద నుంచి నా హాండ్ బేగు తీసుకున్నాను. పెద్ద బాగులోంచి చేతికందిన సామాను తీసి హేండ్ బాగులో సర్ది దాదాపు అయిదారు కేజీల బరువు చేసాను. పిచ్చి వేషాలేస్తే బాగుతో ఇద్దరినీ చావగొట్టేస్తానంతే, అనుకుని కదలకుండా కూర్చున్నాను. నా మనసులో జరుగుతున్న యుధ్ధం గురించేమీ తెలియని మిగతా ముగ్గురూ అలసటతో కునికి పాట్లు పడుతున్నారు.

ఆరుగంటలకి కారు ఒక చిన్న పాకలాటి టీ షాపు ముందు ఆపాడు గులాబ్ సింగ్.

“చాయ్ తాగొద్దాం రండి,” అంటూ తనూ దిగి మురళీని రమ్మన్నాడు.

“నువ్వు కారు దిగొద్దు, నాకు ఒంటరిగా పిల్లలతో కార్లో భయం వేస్తుంది,” అన్నాన్నేను.

“నీ మొహం, అయిదు నిమిషాల్లో వచ్చేస్తా” అని కారు దిగి టీ కొరకు వెళ్ళాడు మా ఆయన.

బరువుగా వున్న హేండ్ బేగ్ చేతిలో గట్టిగా పట్టుకుని కూర్చున్నా, ఎవడైనా కారు తలుపు తెరిస్తే నా చేతిలో చచ్చాడే, అనుకుంటూ.

ఎవరూ కారు దగ్గరికి రాలేదు. టీ కొట్టు దగ్గర గులాబ్ సింగ్ ఎవరికో తన చేతిలో వున్న పెద్ద సంచీ ఇచ్చి బై చెప్పి మళ్ళీ వొచ్చి కార్లో కూర్చున్నాడు. మురళీ టీ తాగి వొచ్చి కూర్చున్నాక కారు మళ్ళీ బయల్దేరింది. గుండెల మీంచి దిగిన భారంతో కళ్ళెంబడి నీళ్ళు తిరిగాయి.

ఆ రాత్రి మమ్మల్ని జైసల్మేర్ చేర్చాడు గులాబ్ సింగ్. మేము బుక్ చేసుకున్న రిసార్ట్ దారి కొంచెం గజిబిజిగా వుండి చాలా ఇబ్బంది అయింది. అయినా ఓపిగ్గా దార్లో అందర్నీ అడుగుతూ ఏమాత్రం విసుగు లేకుండా రాత్రి మమ్మల్ని క్షేమంగా మా రిసార్ట్ చేర్చాడు.

 మర్నాడు సాయంత్రం ఉదయ్ పూర్ ప్రయాణం అయ్యాం. అప్పటికి మాకు కొంచెం పరిచయం పెరిగి దారంతా కబుర్లు చెప్పుకున్నాం.  తను తెలుగు సినిమాలు బాగా చూస్తాడట. బాహుబలి 2 చూడడానికి పనికి సెలవు పెట్టి మరీ చూసాడట. నాగేశ్వర రావు, ఎంటీఆర్ అంటే చాలా ఇష్టమని చెప్పాడు. 

మరి నీకు తెలుగెలా అర్థమవుతుందని అడిగాము. దానికతను నవ్వుతూ తనకు తెలుగు మాట్లాడడం రాదు కానీ బానే అర్థం అవుతుందని చెప్పాడు.

ఎలా అని అడిగితే, తన మొదటి డ్రైవరు ఉద్యోగం తెలంగాణాలోనే అని చెప్పాడు.

“మీకు తెలుసో లేదో, హైదరాబాదు దగ్గర ఒక చిన్న పల్లెటూరు, సూర్యాపేట, అక్కడ నాలుగేళ్ళు పని చేసాను,” చెప్పాడు.

సంతోషంతో కెవ్వు మన్నాను. సూర్యాపేట తెలియకపోవడమేమిటి? మా నాన్నగారు చదువుకున్నదంతా అక్కడేగా. ఆ ఊరెప్పుడూ వెళ్ళిన జ్ఞాపకం లేకపోయినా నాన్నకు సంబంధించిన వూరనే అర్థం లేని ఇష్టం ఆ వూరి మీద. ఆ తరవాత మా కబుర్లు ఎడతెరిపి లేకుండా సాగిపోయాయి. రాజస్థాన్ చరిత్రా, రాజకీయాలూ, పౌరుషాలూ, అబ్బో, ఎన్నెని కబుర్లో.

ఆఖర్న మమ్మల్ని ఉదయ్ పూర్ ఎయిర్ పోర్టు దగ్గర దింపి, ఈసారి మళ్ళీ మీరు ఇటువైపొస్తే తప్పక నా కారులోనే తిప్పుతాను దీదీ, అని నాతో అన్నాడు. మాతో ఫోటోలూ దిగాడు.

బహుశా కారు డ్రైవర్ ని ప్రేమగా కౌగలించుకోవడం మురళీకదే మొదలు. ఇతన్ని ఎంత తప్పుగా అనుకున్నాను! నా అర్థంలేని భయాలకి నా మీదే నాకు చిరాకేసింది. ప్రపంచంలో మీడియా కంటికి కనపడని మంచి వాళ్ళూ వుంటారూ, మామూలు మనుషులు. మన ఊహలూ అంచనాలూ తప్పడం మనకి సాధారణంగా ఇష్టం వుండదు. కానీ మనం పొరబడడం కూడ చాలాసార్లు  సంతోషాన్నిస్తుంది కదా?

ఇంతకీ ఇదంతా ఇప్పుడెందుకు గుర్తొచ్చిందంటే, పిల్లలు మళ్ళీ ఒకసారి రాజస్థాన్ వెళ్దామా, అన్నారు, అందుకు!

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s